కూతురి మీద అతనికున్న అమితమైన ప్రేమ... అతడిని హంతకుడిని చేసింది. కూతురిని ప్రేమించాడని ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన యువతిని లింగస్వామి (26) అనే యువకుడు ప్రేమించాడు. ఆమె కూడా అతని ప్రేమను అంగీకరించడంతో.. ఇద్దరూ  చనువుగా ఉండేవారు.  ఈ క్రమంలో శుక్రవారం సదరు యువతి ఇంటికి లింగస్వామి వెళ్లాడు.

ఆమెతో యువతి ఇంట్లో సరసాలు ఆడటం మొదలుపెట్టాడు. ఈ ఘటన సదరు యువతి తండ్రి కంటపడింది.  పట్టరాని ఆగ్రహంతో, రోకలిబండతో  తలపై బలంగా బాదాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని కుటుంబ సభ్యులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. లింగస్వామి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామకృష్ణ తెలిపారు.