మద్యం తాగుదామని ఆంజనేయులును దయానందనగర్‌కు పిలిచారు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత మైసయ్య కుమారుడు గంగులు తన తల్లి మరణానికి ఆంజనేయులు కారణమంటూ అతడిని కత్తితో గొంతులో పొడిచాడు.

పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి బావమరిదిని దారుణంగా హత్య చేశాడు. మద్యం తాగుదామని పిలిచి మరీ కొట్టి చంపడం గమనార్హం. ఈ సంఘటన నగర శివార్లలలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్‌కర్నూల్‌ జిల్లా, పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన పసుపుల ఆంజనేయులు (45), భార్య సరస్వతి జగద్గిరిగుట్ట లెనిన్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఆంజనేయులు తరచూ సొంత గ్రామానికి వెళ్లి వస్తూ ఉంటాడు.

సూరారం కాలనీ దయానందనగర్‌లో నివాసముండే మైసయ్య, ఆంజనేయులు బావ, బావమరుదులు. కొద్ది కాలం క్రితం మైసయ్య భార్య యాదమ్మ మృతి చెందింది. దీనికి ఆమె సోదరుడు ఆంజనేయులే కారణమని మైసయ్య కుటుంబ సభ్యులు పగపెంచుకున్నారు. ఆంజనేయులును హత్య చేయాలని పథకం పన్నారు. మైసయ్య, ఆయన కుమారుడు గంగులు, ఇతర కుటుంబ సభ్యులు మద్యం తాగుదామని ఆంజనేయులును దయానందనగర్‌కు పిలిచారు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత మైసయ్య కుమారుడు గంగులు తన తల్లి మరణానికి ఆంజనేయులు కారణమంటూ అతడిని కత్తితో గొంతులో పొడిచాడు. ఇతర కుటుంబ సభ్యులైన పవన్‌ అలియాస్‌ లడ్డు, మైసయ్య, చిన్న యాదమ్మ, గంగులు స్నేహితుడు శివ అలియాస్‌ చింటూ కలిసి దారుణంగా హత్యచేశారు. ఆంజనేయులు కుమార్తె జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. నిందితులను దుండిగల్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.