కొడుకులు కావాలనే తపన ఓ వ్యక్తిని హంతకుడిని చేసింది. మొదటి భార్యతో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా.. కొడుకు కావాలని రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆస్తి పంచాలంటూ ఆమె అడగడంతో విసిగిపోయి హత్య చేశాడు.
హైదరాబాద్ : తన పేరున భూమిని రిజిస్టర్ చేయాలని రెండో భార్య వేధిస్తుండడంతో విసిగిపోయిన ఓ వ్యక్తి ఆమెను హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి కొత్తూరులోని చెరువులో పడేశాడు. ఆ తరువాత ఏమనుకున్నాడో ఏమో పోలీస్ స్టేషన్ కు వచ్చి.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతని వాంగ్మూలం మేరకు చెరువులో వెతికిన పోలీసులు, మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే ఈ హత్యలో మొదటి భార్య పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగీ తండాకు చెందిన నిందితుడు కె.శ్రీనివాస్ (47) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి మంజులతో మొదటి వివాహం అయ్యింది. అయితే వీరికి ముగ్గురు అమ్మాయిలే పుట్టారు. దీంతో మొదటి భార్యకు కొడుకులు లేకపోవడంతో తనకు కొడుకు కావాలని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు, పెద్దలను ఒప్పించి 2019లో మృతురాలు సలీ(22)ని రెండో వివాహం చేసుకున్నాడు.
అతనికి మొదటి భార్య మంజుల ద్వారా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయి MBBS చదువుతోంది. రెండవ వివాహం చేసుకున్న సాలి ద్వారా అతనికి ఓ కుమారుడు ఉన్నాడు. అతడి వయసు రెండేళ్లు. అయితే, వీరంతా కలిసే ఉండేవారు. కానీ, భర్త శ్రీనివాస్, మొదటి భార్య మంజులతో తరచూ గొడవలు అవుతుండడంతో సలీ తన తల్లిదండ్రుల ఇంటి వద్దే ఎక్కువ సమయం గడిపేది. అయితే ఈ నెల 18న చింతగట్టు తండాలో తల్లిదండ్రుల ఇంటిదగ్గరున్న భార్య సలీని భర్త లోక్యాతండాకు తీసుకొచ్చాడు. తీసుకువచ్చే సమయంలో ఆమె పేరు మీద ఒక ఎకరం పొలం రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చాడు. దీంతో సలీ, ఆమె రెండేళ్ల కుమారుడితో పాటు భర్తతో కలిసి తిరిగి లింగ్యా తాండాకు వచ్చింది.
అయితే, బుధవారం తెల్లవారుజామున శ్రీనివాస్, సలీతో మళ్ళీ గొడవ పడ్డాడు. గొడవ తీవ్రం కావడంతో విసిగిపోయి శ్రీనివాస్ సలీని చీరతో గొంతుబిగించి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం శ్రీనివాస్ మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి ఇంటి సమీపంలోని చెరువులో పడేసినట్లు తెలిపారు. ఆ తర్వాత తాను ముందు చెప్పి తీసుకువచ్చిన భూమిని ఆమె పేరు మీద రిజిష్టర్ చేయడం ఇష్టం లేకే సలీని హత్య చేశానని పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
పోలీసులు మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యలో మంజుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ సంఘటనలో సలీ బంధువులు శ్రీనివాస్ ఇంటి మీద దాడి చేశారు. మొదటి భార్య మంజుల కూడా ఈ హత్యలో భాగస్వామేనని ఆరోపించారు. న్యాయం జరిగేవరకు చెరువులో నుంచి మృతదేహాన్ని బయటికి తీయనివ్వలేదు. నిందితులను కొత్తూరు పోలీస్ స్టేషన్ నుంచి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించి.. అక్కడే పెద్దల సమక్షంలో బాబు పేరిట ఆస్తి పంపకానికి ఒప్పుకుంటున్నట్లు రాయించుకున్నారని సమాచారం. దీంతో సాయంత్రం శవాన్ని చెరువులోనుంచి బయటకు తీసి షాద్ నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు ఇన్ స్పెక్టర్ బాలరాజు పేర్కొన్నారు.
