Asianet News TeluguAsianet News Telugu

వెలుగులోకి మరో ‘సూది హత్య’.. రెండో భార్యకు ఇంజక్షన్ ఇచ్చి చంపి, ఆస్పత్రి దగ్గర హైడ్రామా..

భార్యను చంపేసి డ్రామా ఆడాడో ప్రబుద్ధుడు. అప్పటికి తమ నిర్లక్ష్యమే కారణమని భావించిన ఆస్పత్రి సిబ్బంది తీరా ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది.

man killed wife by giving anesthetic injection, arrested in khammam
Author
First Published Sep 22, 2022, 9:50 AM IST

ఖమ్మం :  అతనికి ఇద్దరు  భార్యలు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు. ఒకరిని చంపేస్తే తప్ప తనకు మనశ్శాంతి లేదు అనుకున్నాడు. దీంతో చిన్న భార్యకు మత్తుమందు ఇచ్చి చంపేశాడు. ఆమె బిడ్డను ప్రసవించిన మరుసటి రోజే, ఆస్పత్రిలోనే ఇంజక్షన్ చేశాడు. ఆపై వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని లబోదిబోమన్నాడు. ఖమ్మం జిల్లాలో 50 రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం నగరంలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా,  అనస్థీషియా వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు.   

అతనికి మొదట తన మేనకోడలితో వివాహం అయ్యింది. అయితే వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో తనకంటే ఇరవై ఏళ్ల చిన్నది అయిన నవీన (23)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులు ముగ్గురూ అన్యోన్యంగానే ఉన్నారు. నవీనకి పాప పుట్టింది. తర్వాత సవతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నవీన రెండోసారి గర్భం దాల్చింది. గొడవలతో విసిగిపోయిన భిక్షం భార్య నవీనను హతమార్చాలని పథకం వేశాడు. ప్రసవంకోసం జూలై 30న ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆడ శిశువు పుట్టింది. మరుసటి రోజు తెల్లవారేసరికి నవీన ఆస్పత్రిలోనే చనిపోయింది. 

మహిళలతో వ్యభిచారం.. ఆపై పథకం ప్రకారం గొంతు నులిమి హత్య.. నగదు, బంగారాలతో జల్సా.. దంపతుల ఘాతుకం..

సరిగ్గా వైద్యం చేయకపోవడం వల్లే తన భార్య చనిపోయిందంటూ తన బంధువులతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు భిక్షం. నవీన హఠాత్తుగా ఎందుకు చనిపోయింది అర్థం కాని వైద్యులు,  ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. బిక్షం కూతుర్లు ఇద్దరికీ ఆర్థిక సాయం చేస్తామని సదరు ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇచ్చింది. ఆందోళన విరమించిన భిక్షం నవీన మృతదేహాన్ని ఊరికి తీసుకు వెళ్ళకుండా ఖమ్మంలోనే స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశాడు. నవీన అంత్యక్రియలను ఖమ్మంలో నిర్వహించడంతో ఆసుపత్రి సిబ్బందిలో అనుమానం మొదలైంది.

హాస్పిటల్ లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రసవం జరిగిన రోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బిక్షం తన భార్యకు ఇంజక్షన్ ఇవ్వడం, ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వెళ్లి హడావిడి చేయడం కనిపించాయి. నిర్ఘాంతపోయిన ఆస్పత్రి యాజమాన్యం ఖమ్మం టూ టౌన్ పోలీస్ లను సంప్రదించింది. స్వాతంత్ర వజ్రోత్సవాలు, వినాయక చవితి నేపథ్యంలో ఈ విషయాన్ని పోలీసులు లైట్ తీసుకున్నారు. ఇటీవల భిక్షంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా… అసలు విషయం బయటపడింది. నవీనకు ఇంజక్షన్ ద్వారా అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి చంపినట్లు ఒప్పుకున్నాడు. రెండు వారాల క్రితమే పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జమాల్ సాహెబ్ ఘటనతో  ఇది కూడా వెలుగులోకి వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios