సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానంతో భార్య, కొడుకుని అత్యంత దారుణంగా హతమార్చేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా వసంతవాడకు చెందిన రుద్రరాజు సుబ్బరాజు పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని ఓ రంగుల ఫ్యాక్టరీలో ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు.

ఇతనికి గతంలోనే పెళ్లయింది.. అయితే భార్యభర్తల మధ్య విభేదాలతో విడాకులు తీసుకున్నారు. సుబ్బరాజుకు నేర చరిత్ర ఉంది.... అప్పట్లో జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో సుబ్బరాజు నిందితుడిగా ఉండి అనంతరం జైలు నుంచి బయటకు వచ్చాడు.

ఏడాది క్రితం పశ్చిమగోదావరి జిల్లా దువ్వకు చెందిన లక్ష్మీజ్యోతిని రెండో పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీజ్యోతికి గతంలోనే పెళ్లయ్యింది..ఇమెకు చైతన్య అనే తొమ్మిదేళ్ల బాబు ఉన్నాడు. అనంతరం భార్యాబిడ్డలతో పటాన్‌చెరు మండలం చిట్కుల్ నాగార్జున కాలనీలో సుబ్బారాజు కాపురం పెట్టాడు.

అయితే గత కొన్నాళ్లుగా అతను భార్యపై అనుమానం పెంచుకుని ప్రతిరోజు వేధింపులకు పాల్పడుతూ.. ఈ విషయాన్ని డైరీలో రాసుకున్నాడు. శుక్రవారం రాత్రి జ్యోతితో మరోసారి గొడవపడ్డాడు.

అప్పటికి శాంతించిన సుబ్బరాజు.. భార్య నిద్రపోయిన తర్వాత కొబ్బరి బొండాలు కొట్టడానికి వినియోగించే కత్తితో లక్ష్మీజ్యోతిపై దాడి చేయడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. అక్కడితో ఆగకుండా పక్కనే పడుకున్న కొడుకు చైతన్యపైనా దాడి చేశాడు.

కత్తివేటుకు చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. ఇద్దరూ చనిపోయారని భావించిన సుబ్బరాజు వెంటనే హాలులోకి వెళ్లి తాడుతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే శనివారం ఉదయం చుట్టుపక్కల వారు ఈ దారుణాన్ని గుర్తించి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న లక్ష్మీజ్యోతిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.