తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ముక్కూమొహం తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన సిరిసిల్లాలో జరిగింది. కాళ్లు, చేతులు కట్టేసి.. మర్మాంగాన్ని కోసి, రాయితో బాది అత్యంత పాశవికంగా హత్య చేశాడు.

పోలీసులు తెలిపి వివరాలు ప్రకారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరి పల్లెకు చెందిన దొంతరవేణి బాలయ్య అనే వ్యక్తి తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని వేరుగా ఉంటున్నాడు. ఈక్రమంలో గతనెల 20న ఓ వ్యక్తి సోమరిపేట నుంచి రత్నగిరికి రాగా నీరసంగా ఉండడంతో బాలయ్యకు చెందిన బంధువులు భోజనం అందించారు. 

భోజనం చేసిన అతను ఇంటి సమీపంలోని ఇసుక దిబ్బలో నిద్రించాడు. అతడితో మంచిగా మాట్లాడి నమ్మించిన బాలయ్య గంభీరావుపేట మండలం గజసింగవరం అటవీ ప్రాంతంలోని దేవరగుట్టకు  తీసుకెళ్లాడు. 

అతడి బట్టలు విప్పి, చేతులు కాళ్లు కట్టేశాడు. హత్యచేయాలనే ప్రణాళికలో భాగంగా వెంట తెచ్చుకున్న బ్లేడుతో మర్మాంగాన్ని కోసేశాడు. అనంతరం పక్కన ఉన్న బండరాయితో తలపై కొట్టి చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం బాలయ్య ఇంటికి చేరుకున్నాడు. 

గుట్టపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై గ్రామంలో దర్యాప్తు చేయగా హత్య చేసిన బాలయ్యను ఎల్లారెడ్డిపేట సర్కిల్‌ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది తనకు తెలియదని బాలయ్య చెప్పినట్లు పోలీసులు తెలిపారు. 

మృతుడి వివరాలకోసం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. సమావేశంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, ఎల్లారెడ్డిపేట సీఐ బన్సీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.