Honour Killing: నగరంలో పరువు హత్య.. యువ జంటపై గడ్డపారతో దాడి.. యువకుడి మృతి
Honour Killing: హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ పరువు హత్య జరిగింది. ప్రేమపెళ్లి చేసుకున్న జంటపై గుర్తు తెలియని వ్యక్తి గడ్డపారతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. అతని భార్య తీవ్రంగా గాయపడింది.
Honour Killing: హైదరాబాద్ లో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై గుర్తు తెలియని వ్యక్తి గడ్డపారతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. అతని భార్య తీవ్రంగా గాయపడింది. ఈ అమానుషఘటన హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో చోటుచేసుకుంది. మృతుడిని రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో నివాసముంటున్న
ప్రైవేట్ ఉద్యోగి బి నాగరాజు (25)గా .. గాయపడిన యువతిని గృహిణి సయ్యద్ అష్రిన్ సుల్తానా అలియాస్ పల్లవి (23)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే గ్రామానికి చెందిన బిల్లా పురం నాగరాజు (25), సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా (23) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. ఇరువర్గాల పెద్దలు వారి పెళ్లిని వ్యతిరేకించారు. దీంతో వారి పెద్దలకు వ్యతిరేకించి.. జనవరి 31, 2022 న లక్ష్మీ నగర్‌లోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అయితే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా కుటుంబ సభ్యులు వివాహానికి అడ్డు చెప్పారు. ప్రేమ వివాహం చేసుకున్న తరువాత రక్షణ కావాలని పోలీసులను కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ యువ జంట రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో నివాసముంటున్నారు. నాగరాజ్ ఓ కార్ల షో రూమ్ లో సేల్స్ మేన్ గా పనిచేస్తూ.. సంతోషంగా జీవించడం ప్రారంభించారు. అంత సాఫీగానే ఉందని భావించిన ఆ యువ జంట జీవితంలో ఊహించిన ఘటన జరిగింది.
బుధవారం రాత్రి 9 గంటల ఈ సమయంలో నాగరాజు, సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా ద్విచక్రవాహనంపై సరూనగర్ వైపు వెళ్తుండగా..సరూర్నగర్ మున్సిపల్ కార్యాలయం పంజాల అనిల్ కుమార్ కాలనీ వద్ద గుర్తుతెలియని ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి నాగరాజు వాహనాన్ని అడ్డగించి ఇనుప రాడ్‌తో నాగరాజుపై దాడి చేశాడు. రద్దీగా ఉండే రోడ్డుపై జనాలు చూసే చోట నాగరాజును కత్తితో పొడిచాడు. గమనించిన ఇతర వాహనదారులు దంపతులను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, తీవ్ర రక్తస్రావమైన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, ఈ ఘటనలో పల్లవి తీవ్రంగా గాయపడిందని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
హత్యకు సంబంధించి విచారణ జరుపుతున్నామని పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారన్నారు. హత్య జరిగిన సంఘటన స్థలానికి క్లూస్ టీం కూడా చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారని చెప్పారు. పరువు హత్య గా భావించిన పోలీసులు సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా కుటుంబ సభ్యుల హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.