భూత వైద్యం పేరుతో ఓ యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వివరాల్లోకి వెళితే.. బోరబండ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు వారి కుమార్తెతో కలిసి 20 రోజుల కిందట, మల్లేపల్లిలో భూత వైద్యుడిగా చెప్పుకుంటున్న ఆజంను కలిశారు.

వారింట్లో దయ్యం ఉందని... దానిని వదిలిస్తేకాని మంచి జరగదని భయపెట్టాడు. దీంతో చేసేది లేక యువతిని బీదర్‌లోని ఓ దర్గాకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాకా.. తనను పెళ్లి చేసుకోవాలని.. లేని పక్షంలో నీ తల్లిదండ్రులు చనిపోతారని ఆమెను బెదిరించాడు.

తరువాత ఈ నెల 11న బోరబండలోని వారి ఇంటికివెళ్లి యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తన బంధువుతో కలిసి ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే అతనిని పోలీసులు సున్నితంగా చూడటం కోసం గతంలో ఎస్సార్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసి, ప్రస్తుతం మరో జిల్లాలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఓ అధాకారి లాబీయింగ్ సాగిస్తున్నట్లు తెలిసింది. కాగా ఆజం నాంపల్లిలోని ఓ దర్గా సమీపంలో భూత వైద్యురాలిగా పనిచేస్తున్న మహిళకు శిష్యుడు.