ఓ అమాయక మహిళకు మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి లాగడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని మేడ్చల్ జిల్లా కోర్టు కఠినంగా శిక్షించింది. 

హైదరాబాద్: మహిళల రక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి కఠిన చట్టాలు తీసుకువస్తున్నాయి. పోలీస్ వ్యవస్థ కూడా మహిళలపై వేధింపులకు దిగుతున్న వారిని, అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులతో కఠినంగా వ్యవహరిస్తోంది. న్యాయస్థానాలు కూడా మహిళల రక్షణపై ఏమాత్రం భంగం కలిగించినా ఉపేక్షించడం లేదు. తాజాగా ఓ మహిళను వ్యభిచార కూపంలోకి దించడం కాదు దించాలని ప్రయత్నించిన వ్యక్తికి కఠిన శిక్ష విధించిన మేడ్చల్ జిల్లా కోర్టు. ఇలా మహిళలో జీవితాలతో ఆడుకుంటూ... వారిని ఆటబొమ్మలుగా భావించి శరీరంతో దందా చేయాలని చూసేవారికి భయాన్ని కలిగించేలా కోర్టు తీర్పు వుంది. 

వివరాల్లోకి వెళితే... గతేడాది విశాఖపట్నానికి చెందిన మహిళ ఒంటరిగా హైదరాబాద్ కు బయలుదేరింది. ఆమె కర్నూల్ బస్టాండ్ లో వుండగా గమనించిన బుగ్గన మధుమోహన్ రెడ్డి(33) మాటకలిపి వివరాలు సేకరించారు. ఆమె అమాకత్వాన్ని గుర్తించిన అతడు సాయం చేస్తానంటూ మాయమాటలు చెప్పి దారుణానికి సిద్దమయ్యాడు. 

మహిళను హైదరాబాద్ కు తీసుకువచ్చిన అతడు వ్యభిచార కూపంలోకి లాగడానికి ప్రయత్నించాడు. అతడి దురుద్దేశం తెలుసుకున్న సదరు మహిళ ఎలాగో తప్పించుకుని స్థానికుల సాయంతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు మధుమోహన్ అరెస్ట్ చేసారు. 

ఏడాదిగా ఈ కేసును విచారించిన మేడ్చల్ జిల్లా న్యాయస్థానం తాజాగా మధుమోహన్ దోషిగా తేల్చింది. మహిళతో వ్యభిచారం చేయించాలని నీచంగా ఆలోచించిన అతడికి రెండేళ్ళ జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఇలా మహిళకు మరింత రక్షణ కల్పించే దిశగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రజలు అభినందిస్తున్నారు. ఇకపై మహిళలతో బలవతంగా వ్యభిచారం చేయించాలని భావించే దుర్మార్గులకు ఈ తీర్పు ఓ హెచ్చరిక అవుతుందని అంటున్నారు. 

ఇదిలావుంటే ఓ బాలిక నిస్సహాయ స్థితిని అదునుగా చేసుకుని ఓ మహిళ వ్యభిచార కూపంలో లాగిన ఘటన గతేడాది గుంటూరులో వెలుగుచూసింది. కరోనా సోకిన సమయంలో బాలిక హాస్పిటల్ లో వుండగా ఓ మహిళ పరిచయం పెంచుకుంది. మహిళ తండ్రిని కూడా మాటలతో నమ్మించి బాలికను తనవెంట తీసుకెళ్లి వ్యభిచార కూపంలోకి లాగింది.

అయితే విషయం బయటపడటంతో మైనర్ బాలికతో వ్యభిచారం చేయించిన మహిళతో పాటు ఏకంగా 80 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. వీరిలో ఇప్పటికే చాలామందిని అరెస్టవగా తాజాగా మరో 10 మందిని అరెస్టు చేసారు.

ఈ కేసులో 80 మంది నిందితులను గుర్తించామని ఏఎస్పీ సుప్రజ చెప్పారు. గుంటూరుకు చెందిన హేమలత.. మైనర్ బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో ఒక నిందితుడు లండన్‌లో ఉన్నాడని వివరించారు. నిందితుల కోసం విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, నెల్లూరు పలు ప్రాంతాల్లో గాలించి అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇంకా కొందరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపులు జరుపుతున్నామని చెప్పారు. ఈ కేసులో నిందితుల వద్ద నుంచి ఒక కారు, 53 సెల్‌ఫోన్లు, 3 ఆటోలు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

ఈ కేసులో కొందరికి ఇప్పటికే జైలు శిక్ష పడిందని తెలిపారు. అయితే ఇటీవలే ఈ కేసు విషయమై కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న వార్తలు వచ్చాయని, అవి అవాస్తవాలని ఏఎస్పీ సుప్రజ కొట్టిపారేశారు. కొంతమంది నిందితులకు ఫోన్ చేసి డబ్బుల కోసం హేమలత బెదిరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని.. దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులు కొందరు జైలు నుంచి బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చారని... తాజాగా అరెస్టు చేసిన వారిని కోర్టులో ప్రవేశపెడతామని పేర్కొన్నారు.