ప్రమాదవశాత్తు బావిలో పడిన ఓ వ్యక్తి దాదాపు 30 గంటల పాటు అందులోనే బిక్కు బిక్కుమంటూ గడిపాడు. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వజ్ర రాజమొగిలి ఆడ్తి వ్యాపారి..గురువారం హన్మకొండలోని బంధువుల ఇంటికి వచ్చి..తిరిగి శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంట ప్రాంతంలో తన బైక్‌పై బయలుదేరాడు.

ఈ క్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం నాగారం శివారు వద్దకు రాగానే.. ఇతని బైక్‌ను గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన రాజమొగిలి తన ద్విచక్ర వాహనంతో పాటు దాదాపు 75 అడుగుల లోతున్న బావిలోకి ఎగిరిపడ్డాడు.

కాపాడాలని కేకలు వేసినప్పటికీ తెల్లవారుజాము కావడంతో ఎవరికి అతని అరుపులు వినిపించలేదు. దీంతో బావిలో మోటారు పైపును ఆసరాగా చేసుకుని 30 గంటల పాటు గడిపాడు. అందులో ఉన్న పాములు మీదకొస్తుండటంతో ప్రాణభయంతో బావిలోనే అటూ ఇటూ ఈతకొట్టాడు.

ఈ క్రమంలో శనివారం ఉదయం రాజమొగిలి కేకలు పొలం వద్ద పనులు చేస్తున్న బావి యజమాని సమ్మిరెడ్డికి వినిపించాయి వెంటనే అతనిని ఓదార్చిన అతను.. అధైర్యపడొద్దని ధైర్యం చెప్పి విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు.

దీంతో గ్రామస్తులు తాళ్లు తీసుకుని బావి వద్దకు వచ్చి.. వాటిని మొగిలి వద్దకు జారవిడిచారు. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో బాగా నీరసించిపోయిన అతను శక్తిని కూడగట్టుకుని తాడు సహాయంతో పైకి ఎక్కాడు.

వెంటనే స్థానికులు అతనికి సపర్యలు చేసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం రాజమొగిలి మాట్లాడుతూ... నా బైక్‌ను వేరే వాహనం ఢీకొట్టినట్లనిపించింది. ఒక్కసారిగా ద్విచక్రవాహనంతో పాటు బావిలోకి పడ్డాను అని తెలిపాడు.

ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకుని ఉండటంతో తలకు ఎలాంటి గాయం కాలేదు.  వెంటనే దానిని తీసి రక్షించమని అరుస్తూనే ఉన్నానని తెలిపాడు. బావిలో ఉన్న పాములు మీదకు వస్తుండటంతో అక్కడ ఉన్న చెట్ల ఆకులు, కొమ్మలను వాటిపైకి విసిరి తప్పించుకున్నానన్నాడు.

మోటారు పైపు పట్టుకుని బావి ఒడ్డును ఆసరాగా చేసుకుందామంటే మట్టిపెళ్లలు కూలాయని మొగిలి తెలిపాడు. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డానని, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపాడు. 

"