కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర్రంలోనూ రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం కేసులు కాస్త తగ్గినట్లు అనిపించినా.. మళ్లీ పెరగడం మొదలైంది. తాజాగా.. ఓ వ్యక్తి కరోనా సోకి ప్రాణాలు కోల్పోగా.. అతని మృతదేహం మార్చురీలో ఉండిపోయింది. కాగా.. అతని కుటుంబసభ్యులంతా క్వారంటైన్ లో ఉండిపోయారు. కనీసం అతనికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరం వనస్థలీపురంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌ వనస్థలిపురంలో 78ఏళ్ల వృద్ధుడి పెద్ద కుమారుడు సరూర్‌నగర్‌లో నివాసం ఉండగా.. వనస్థలిపురంలో చిన్న కుమారుడి వద్ద  ఉంటున్నాడు.

మూడురోజుల క్రితం పెద్ద కుమారుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో రెండు కుటుంబాలను క్వారంటైన్‌ చేశారు. బాత్‌రూంలో జారిపడటంతో తీవ్ర గాయాలైన వృద్ధు డు, గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటికే అతడి నుంచి శాంపిల్స్‌ సేకరించగా పాజిటివ్‌ అని నిర్ధారణ జరిగింది.  ఇంట్లో అందరూ క్వారంటైన్‌లో ఉండటంతో అంత్యక్రియలను జీహెచ్‌ఎంసీ అధికారులే నిర్వహించేలా అంగీకార పత్రాన్ని రాసిచ్చారు.