హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో.. ఓ యువకుడు లారీ కింద పడి మృతిచెందాడు.

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో.. ఓ యువకుడు లారీ కింద పడి మృతిచెందాడు. ఈ ఘటన అబిడ్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్మాస్‌ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. శాలిబండకు చెందిన 20 ఏళ్ల జైసాయి శుక్రవారం వినాయక నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్‌ వద్దకు వచ్చారు. గణేష నిమజ్జంన పూర్తైన తర్వాత శనివారం తెల్లవారుజామున లారీలో తిరిగి వెళ్తుండగా.. చర్మాస్ వద్దకు రాగానే వాహనంపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు.

అయితే లారీ వెనక చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో.. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకన్న అబిడ్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌ ట్యాంక్ బండ్ వద్ద రెండు రోజు గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. హైదరాబాద్ నలుమూలల నుంచి నిమజ్జనానికి భారీగా గణేష్ విగ్రహాలు తరలివస్తున్నాయి. అధికారులు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, సంజీవ‌య్య పార్క్, ట్యాంక్ బండ్ రోడ్ల‌పైకి గ‌ణ‌నాథుల‌ను త‌ర‌లిస్తున్నారు. వేగంగా నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రోజు రాత్రి వరకు నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు సాధారణ వాహనదారులకు ఇబ్బంది లేకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. 

ఇక, శుక్రవారం ఉదయం హుస్సేన్ సాగర్‌లో భారీగా గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. గణేష్ శోభాయాత్ర సాగుతున్న మార్గం.. జై బోలో గణేష్ మహారాజ్.. నినాదాలతో మారుమోగుతుంది. రాత్రి 7 గంటల సమయంలో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తయింది. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌ వరకు శోభాయాత్ర నిర్వహించి.. అనంతరం ట్యాంక్ బండ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద మహాగణపతిని నిమజ్జనం చేశారు. దాదాపు 20 కి.మీ దూరం నుంచి శోభాయాత్ర హుస్సేన్ సాగర్‌కు చేరుకున్న బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని రాత్రి 10.32 గంటలకు క్రేన్ నంబర్ 6 వద్ద నిమజ్జనం చేశారు. అనంతరం మిగిలిన గణనాథుల నిమజ్జన ప్రక్రియ వేగవంతమైంది.