Asianet News TeluguAsianet News Telugu

తమ్ముడి భార్య, అత్తగారి వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య..!!

తమ్ముడి భార్య, ఆమె కుటుంబసభ్యుల వేధింపులతో విసిగిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. 

Man commits suicide by taking selfie video over brother wife and her family Harassment in hyderabad
Author
First Published Sep 23, 2022, 2:00 PM IST

హైదరాబాద్ : తమ్ముడి భార్య, కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ కథనం మేరకు వివరాలు ఇలాఉన్నాయి... బబ్బుగూడకు చెందిన శీలం వీరస్వామి, పుష్ప దంపతులకు ముగ్గురు కుమారులు.

వీరస్వామి రెండో కుమారుడు హరినాథ్ కు 2020లో తాండూరుకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. వారికి సంతానం కలగకపోవడంతో ఆ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మి ఆరునెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.  అదనపు కట్నం కోసం అత్తింటివారు తనను వేధిస్తున్నారని భర్త హరనాథ్ తో పాటు అతడి సోదరుడు ప్రసాద్, ఇతర కుటుంబ సభ్యులపై తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 

చర్లపల్లి సెంట్రల్ జైలు సిబ్బందిపై రాజాసింగ్ భార్య తీవ్ర ఆరోపణలు..

దీంతో పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. భాగ్యలక్ష్మికి రూ.12 లక్షలు ఇచ్చి రాజీ చేసుకోవాలని ఇరు కుటుంబాలు అంగీకారానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం పలుదఫాలుగా డబ్బులు చెల్లించాల్సి ఉంది. గత నెల రూ. రెండులక్షలు చెల్లించాల్సి ఉండగా సర్దుబాటు  కాకపోవడంతో చెల్లించలేదు. దీంతో భాగ్యలక్ష్మి సోదరుడు హనుమంతు  తరచూ ప్రసాద్ కు ఫోన్ చేసి వేధిస్తుండేవాడు. అతడితో పాటు పోలీసులు కూడా ఫోన్ చేస్తుండడంతో మనస్థాపానికి లోనైన ప్రసాద్ గురువారం ఉదయం తమ్ముడి భార్య కుటుంబ సభ్యుల వేధింపులను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఇలా సెల్ఫీ తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లిలో సెప్టెంబర్ 6న చోటు చేసుకుంది. కుటుంబ సమస్యలతో విసిగిపోయిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆ సమయంలో ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రొంపికుంటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మానుపాటి సాయిలు-తిరుపతమ్మ దంపతుల రెండో కుమారుడు కార్తీక్ (22) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే కానిస్టేబుల్ పరీక్షలకు సైతం హాజరయ్యారు. కాగా కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురయ్యాడు. ఘటన జరిగిన రోజు సాయంత్రం ఇంట్లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత పొలం వద్దకు వెళ్లి వీడియోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు.

‘మా బాపులా ఎవరూ చెయ్యద్దు. పిల్లల జీవితాలను నాశనం చేయొద్దు.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా’ అని మాట్లాడటం ఆ వీడియోలో కనిపిస్తుంది. వాట్సాప్ స్టేటస్ చూసి కుటుంబ సభ్యులు కార్తీక్ కు ఫోన్ చేయడంతో విషయం చెప్పాడు. వెంటనే వాళ్లు పొలం వద్దకు వెళ్లి.. కార్తీక్ ను పెద్దపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.  జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గుడిసె గట్టయ్యయాదవ్ తో పాటు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పెండం రాజేష్ ఆసుపత్రికి వెళ్లి కార్తీక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని షేక్ మస్తాన్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios