చెడు వ్యసనాలు మానేసి.. బుద్ధిగా ఉండమని ఆమె  భర్తకు చెప్పింది. అలా చెప్పడమే ఆమె పాలిట యమపాశమైంది. తాగుడు మానేసి బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించమని చెప్పినందుకు అతి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన ఆదిలా బాద్ జిల్లా దండేపల్లి మండలం రెబ్బన్ పల్లిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రెబ్బన్ పల్లి గ్రామానికి చెందిన బత్తుల అమ్మాయి(52) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. భర్త లచ్చన్న తాగుడుకు బానిస కావడంతో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. శనివారం వారిద్దరూ అదే గ్రామంలో ఉంటున్న కూతురు ముత్యం మల్లీశ్వరి ఇంటికి వెళ్లారు. అక్కడే భోజనం చేసి రాత్రి ఇంటికి చేరుకున్నారు. మళ్లీ మద్యం విషయంలో గొడవపడ్డారు. రాత్రి సమయంలో లచ్చన్న రోకలి దుడ్డుతో అమ్మాయి తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఆదివారం ఉదయం తన కూతురు ఇంటికి వెళ్లి భార్యను హత్య చేసిన విషయం చెప్పాడు. వారు హుటాహుటిన ఇంటికి వెళ్లి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లచ్చన్నను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.