దొంగతనం చేస్తుండగా పట్టుకుని అవమానించాడన్న కోపంతో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా బండరాయితో మోది హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి: దొంగతనం చేస్తుండగా పట్టుకుని అవమానించాడన్న కోపంతో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చాడు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో తలపై బండరాయి వేసి దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని తిమ్మన్నగూడెంకు చెందిన పెద్దగొల్ల బీరప్ప(32) చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడు. ఇలా ఈ నెల 5వ తేదీన సదాశివపేట పట్టణంలో ఓ ట్రాక్టర్ నుండి బ్యాటరీని దొంగిలించడానికి ప్రయత్నించాడు. దీన్ని గమనించిన పెద్దగొల్ల పాపయ్య(65) మరికొందరితో కలిసి బీరప్పను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదారు. అంతేకాకుండా అతడిపై మూత్ర విసర్జన చేసి ఘోరంగా అవమానించారు.
read more ప్రియుడితో రాసలీలలు: ఆకస్మాత్తుగా ఇంటికొచ్చిన భర్త, చివరికిలా....
ఈ అవమానంతో రగిలిపోయిన బీరప్ప దారుణానికి ఒడిగట్టాడు. పాపయ్య కదలికలపై నిఘా పెట్టిన అతడు ఈ నెల 6వ తేదీన సదాశివపేటలోని లక్ష్మీ కాంప్లెక్స్ వద్ద నిద్రిస్తుండగా గుర్తించాడు. ఇదే అదునుగా భావించిన అతడు పెద్ద బండరాయితో పాపయ్య తలపై మోది అతి కిరాతకంగా హతమార్చాడు.
తెల్లవారుజామున రక్తపుమడుగులో పడివున్న పాపయ్య మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా హత్యకు ముందురోజు బీరప్ప దొంగతనం, అవమానం విషయం బయటపడింది. దీంతో బీరప్పను పట్టుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్పీ బాలాజి వెల్లడించారు.
