తాను అల్లారుముద్దుగా పెంచుకున్న చెల్లిని.. కట్టుకున్నవాడు డబ్బుల కోసం వేధించడం చూసి తట్టుకోలేకపోయారు. చెల్లి పడుతున్న బాధలు చూసి చలించిపోయారు. అంతే.. తన చెల్లి జీవితం హాయిగా ఉండాలని ఏకంగా బావను హత్య చేశారు. ఈ సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బీడీ వర్కర్స్‌ కాలనీకి చెందిన గుర్జా ప్రవీణ్‌ (38), లావణ్య దంపతులు. పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని ప్రవీణ్‌ తరచుగా లావణ్యను వేధిస్తున్నాడు. ఈ తరుణంలో వారం రోజుల క్రితం లావణ్య అన్నదమ్ములైన రమేశ్‌, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌లు వారి భూమిని విక్రయించారు. వచ్చిన డబ్బులో తమకు కొంత ఇవ్వాలని అడగాలంటూ ప్రవీణ్‌.. లావణ్యపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. 

ఈ తరుణంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. విషయాన్ని ఆమె తన అన్నదమ్ములకు చెప్పగా, వారంతా తమ భార్యలతో కలిసి సోమవారం ఉదయం ప్రవీణ్‌ ఇంటికి వచ్చారు. వారితో ప్రవీణ్‌కు తీవ్ర వాగ్వాదం జరుగగా, అప్పటికే తమ చెల్లిని హింసిస్తున్నాడని కోపంతో ఉన్న వారంతా కలసి కర్రలు, ఇటుకలతో ప్రవీణ్‌పై దాడి చేశారు. 

వారితో పాటు లావణ్య కూడా భర్తపై దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాల పాలైన ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సోమనాథం తెలిపారు.