హెచ్చార్సీ ఎదుటే ప్రేమించిన యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. పెళ్లెప్పుడు చేసుకుంటావని నిలదీసినందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఎదుట గురువారం జరిగింది. 

వివరాల్లోకి వెడితే వనపర్తి జిల్లాకు చెందిన కమిరెడ్డి కవిత(28), కృష్ణా జిల్లాకు చెందిన భూక్యా అశోక్‌ కుమార్‌(30) ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కొంతకాలంగా సహజీవనం కూడా చేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా పెళ్లిచేసుకోవాలని కవిత అశోక్‌ను కోరుతోంది. సహజీవనం సాగించిన అశోక్‌ తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు.

దీంతో అతనిపై జవహర్‌ నగర్‌  పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడితో మాట్లాడటంతో 20 రోజుల్లో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే అతను ఇచ్చిన మాట తప్పడంతో బాధితురాలు హెచ్చార్సీని ఆశ్రయించింది. 

గురువారం విచారణకు హాజరైన భూక్యా అశోక్‌ కుమార్‌ను కాలర్‌ను ప్రియురాలు  పట్టుకుని నిలదీయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  ఈ క్రమంలో ప్రియుడు  అశోక్‌ కుమార్‌.. కవితపై దాడి చేశారు. ఈ దాడిలో కవిత కుడి చెయ్యికి స్వల్ప గాయాలు అయ్యాయి. అనంతరం పోలీసులు ఇరువురిని అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.