Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి చేయడం లేదని తండ్రి, బాబాయ్ లను చంపి.. తులసి చెట్టుకు పూజ చేసి...

పెళ్లి చేయడం లేదన్న కోపంతో తండ్రిని, చిన్నాన్నను అతి దారుణంగా హత్య చేశాడో యువకుడు. ఆ తరువాత వింతగా ప్రవర్తించాడు. ఈ ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది.  

man assassinated father, uncle for not allowing him to marry in nizamabad, telangana
Author
Hyderabad, First Published Aug 13, 2022, 9:00 AM IST

నిజామాబాద్ :  తనకు పెళ్లి చేయడం లేదన్న కోపంతో తండ్రిని, చిన్నాన్నను హతమార్చాడు ఓ యువకుడు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కర్రోల్ల పెద్దబ్బయ్య (64), కర్రోళ్ల నడిపి సాయిలు (54) అన్నదమ్ములు. పెద్దబ్బయ్య ముగ్గురు కొడుకులు బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లారు. వీరిలో రెండో కొడుకు సతీష్ ప్రవర్తనలో తేడా రావడంతో… కంపెనీ ప్రతినిధులు నాలుగేళ్ల క్రితం అతడిని స్వగ్రామానికి పంపించివేశారు.

అతనికి ఇక్కడ తల్లిదండ్రులు పలు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చినప్పటి నుంచి పనిపాట లేకుండా
ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ మధ్య కాలంలో తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులతో గొడవలు పడుతున్నాడు. ఇటీవల తానే పెళ్లి సంబంధం కుదుర్చుకుని వచ్చి ఇంట్లోవాళ్లకు చెప్పాడు. ఆడపెళ్ళి వారు ఆగస్టు 14న ఇంటికి వస్తారని గురువారం రాత్రి చెప్పాడు. గల్ఫ్ లో ఉన్న అన్నదమ్ములతో మాట్లాడిన తర్వాత వాళ్లని రమ్మని చెబుదాం లెమ్మని తండ్రి కొడుకును వారించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 

చిన్నాన్న సాయిలు వచ్చి సతీష్ కు నచ్చచెప్పి వెళ్ళిపోయాడు.  శుక్రవారం ఉదయం 6 గంటలకు మళ్ళీ గొడవ మొదలయ్యింది.  వెంటనే కోపోద్రిక్తుడైన సతీష్.. ఆవరణలో  పనిచేస్తున్న తండ్రిని కర్రతో  కొట్టడానికి వెళ్ళాడు. ఇది చూసిన నడిపి సాయిలు అడ్డుకున్నాడు.  వెంటనే సతీష్ అక్కడే ఉన్న పారతో సాయిలు తలపై బలంగా కొట్టాడు. సాయిలు అక్కడికక్కడే పడిపోయాడు. పెద్దబ్బయ్య అరుస్తూ తమ్ముడి వద్దకు రాగానే, తండ్రిని కూడా బలంగా మోదాడు. ఇద్దరి తలలపై  మరోసారి బాది చనిపోయారని నిర్ధారణకు వచ్చాక నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న ఏసీపీ వెంకటేశ్వర్లు సీఐ నరహరి ఎస్సై మహేష్, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సిఐ తెలిపారు.

మునుగోడులో కాల్పులు : వివాహేతర సంబంధంతోనే హత్యకు ప్లాన్..తొమ్మిది మంది అరెస్ట్..

హత్య చేసి, తులసి చెట్టుకు పూజ..
తల్లి, వదినను కూడా చంపేందుకు ప్రయత్నించగా తల్లి బయటకు పరిగెత్తింది.  వదిన ఇంట్లో గదిలోకి వెళ్లి గొల్లం పెట్టుకుని ప్రాణాలు దక్కించుకుంది.  అని స్థానికులు తెలిపారు. ఇద్దరిని హత్య చేసిన తర్వాత నిందితుడు తులసి చెట్టు చుట్టూ తిరిగి పూజలు చేశాడని వెల్లడించారు. పెద్దబ్బయ్య ఇతనికి భార్య లక్ష్మి, నడిపి సాయిలు చితికి  కుమార్తె నిప్పంటించారు.  కుమారుడు గల్ఫ్ లో ఉండగా భార్య మూడేళ్ల క్రితమే క్యాన్సర్ తో మృతి చెందింది. 

ఇదిలా ఉండగా, మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ పురుగులమందును మంచినూనె అనుకుని కూర వండింది. ఆ తర్వాత అన్నంలో కలుపుకుని తినింది. తాను తినడమే కాక భర్తకు, కూతురికి సైతం వడ్డించింది. ఈ క్రమంలో ఆమె మృత్యువాత పడింది. భర్త కూడా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ సంఘటనపై ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఠాణాలో శుక్రవారం కేసు నమోదయ్యింది.  పోలీసుల కథనం ప్రకారం.. మేడిద పల్లికి చెందిన బండ్ల నాగమ్మ (37) మతిస్థిమితం లేక ఇబ్బంది పడుతోంది. 

గురువారం ఉదయం ఇంట్లో మంచి నూనెకు బదులు దాని పక్కనే ఉన్న పురుగుల మందుతో కూర వండింది. ఆ తర్వాత ఆ కూరతో తాను అన్నం తిని, చేలో పనిచేస్తున్న భర్త పుల్లయ్య, కూతురు పల్లవిలకు భోజనం తీసుకు వెళ్ళింది. మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య కొంతమేర ఆ అన్నం తిన్నాడు. మందు వాసన రావడంతో అమ్మాయి అన్నాన్ని పడేసింది. నాగమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

Follow Us:
Download App:
  • android
  • ios