హైదరాబాద్: మామ లైంగిక వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాదులోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బషీర్ బాగ్ లోని పూల్ బాక్ కు చెందిన పాతికేళ్ల కె. ప్రియాంక లోయర్ ట్యాంక్ బండ్ గాంధీనగర్ కు చెందిన రమేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 

వారి వివాహం ఏడాదిన్నర క్రితం జరిగింది. వారికి ఏడు నెలల కూతురు ఉంది. కొంత కాలంగా రమేష్ తండ్రి వెంకటేష్ (50) ప్రియాంకను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రియాంక పలుమార్లు కుటుంబ సభ్యులకు చెప్పింది. పెద్దలు నచ్చజెప్పి తండ్రిలాంటి వాడని చెప్పడంతో అత్తారింటికి వెళ్లింది. 

ప్రియాంక భర్త రమేష్ అత్తాపూర్ లో ఐస్ క్రీమ్ షాపులో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. రమేష్ బుధవారం సాయంత్రం ప్రియాంకను, కూతురును ఫూల్ బాగ్ లోని వారి తల్లిదండ్రుల ఇంట్లో వదిలి వెళ్లాడు. పూల్ బాగ్ లోని జేఎన్ఎన్ యూఆర్ఎం ప్రభుత్వ క్వార్టర్స్ లో తల్లిదండ్రులు ఉంటుండగా, మూడో అంతస్థులో ఆమె అన్న ఉంటున్నాడు. 

గురువారం అందరూ పనుల్లోకి వెళ్లిన తర్వాత భర్తతో ఫోన్ లో మాట్లాడుతూ మూడో అంతస్తులోని తన ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా తలుపు గడియ పెట్టి ఉంది. కిటికీలోంచి చూడగా ప్రియాంక ఫ్యాన్ కు వెలాడుతూ కనిపించింది.

తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి ఆమెను దింపారు. అయితే, అప్పటికే ఆమె మరణించింది. ప్రియాంక తండ్రి నర్సింగ రావు ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.