అప్పుల అప్పారావులా ఎవరి దగ్గర పడితే వారి దగ్గర అప్పులు చేసి రుణం చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అప్పుల అప్పారావులా ఎవరి దగ్గర పడితే వారి దగ్గర అప్పులు చేసి రుణం చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలకు చెందిన జి.మధుసూదన్‌రావు ఉపాధి నిమిత్తం 1984లో హైదరాబాద్‌కు వలస వచ్చాడు.

1994లో అబిడ్స్ ప్రాంతంలో షార్ప్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఎనిమిదేళ్లు నడిచిన ఆ కంపెనీ అనంతర కాలంలో మూతబడింది. దీంతో పారామౌంట్ సర్వైలెన్సెస్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేశాడు.

వివిధ సంస్థలకు మానవ వనరులను ఏర్పాటు చేసే వ్యాపారం చేశాడు. ఈ క్రమంలో అనేక మందికి చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి భారీగా అప్పులు తీసుకున్నాడు. ఇలా మొత్తం రూ.5 కోట్ల వరకు అప్పులు అయ్యాయి.

వీటిని తిరిగి చెల్లించలేకపోవడంతో పాటు ఇతనికి అప్పులు ఇచ్చిన వారి.. రాధాకిషన్‌రావు ఇచ్చిన చెక్కులను బ్యాంకుల్లో వేసుకోగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో రుణదాతలు హైదరాబాద్, రాచకొండల్లోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో 20 కేసులు నమోదయ్యాయి.

వీటిలో కొన్ని కేసుల్లో అరెస్ట్ అయిన మధుసూదన్‌రావు బెయిల్‌పై వచ్చి కోర్టు వాయిదాలకు హాజరుకావట్లేదు. ఈ నేపథ్యంలో ఇతడిపై ఏడు నాన్-బెయిలబుల్ వారెంట్లు, ఐదు బెయిలబుల్ వారెంట్లు జారీ కావడంతో పాటు మరో ఐదు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు.

దాదాపు ఏడాది కాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మధుసూదన్‌రావు జాడ ఎవరికీ చిక్కలేదు. దీంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందంగా ఏర్పడి ఇతనిని తీవ్రంగా గాలించింది. సోమవారం ఎట్టేకేలకు మాటువేసి ఇతనిని పట్టుకున్నారు.