తమ ప్రేమకు పెద్దలు అంగీకరించరేమోనన్న భయంతో ఓ ప్రేమ జంట విషం తాగిన విషాద ఘటన వికారాబాద్ లో కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే... వికారాబాద్‌ జిల్లా తాండూరులోని ఓ గ్రామ శివారులో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. 

ఈ ఘటనలో ప్రేమికురాలు మృతిచెందగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆ గ్రామానికి చెందిన బాలిక (16), బాల్‌రాజ్‌ (22) గత ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఇది బాలిక ఇంట్లో తెలియడంతో ఇద్దరూ కంగారుపడ్డారు.

మంగళవారం అర్ధరాత్రి గ్రామ శివారులోని బాల్‌రాజ్‌ వ్యవసాయ పొలానికి  వెళ్లారు. అక్కడ ఉన్న గదిలో ఇద్దరు పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. అక్కడ ఆమెను చూసిన కుటుంబ సభ్యులు, తాండూరు జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి వికారాబాద్‌ మిషన్‌ ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బాల్‌రాజును హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.