గత కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ నాయకులకు, రాష్ట్రంలోని టీఆర్ఎస్ నాయకులకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రం సమైఖ్య స్పూర్తిని దెబ్బతీస్తోందంటూ, రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందంటూ టీఆర్ఎస్ అధినేత ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీపై పోరాటం చేయాలని సందర్భానుసారం చెబుతున్నారు. అయితే ఇదే విషయంలో మంగళవారం మమతా బెనర్జీ లేఖ రాశారు. కానీ దీనికి టీఆర్ఎస్ ఇప్పటి వరకు స్పందించలేదు. 

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా క‌లిసిక‌ట్టుగా పోరాడాల‌ని పిలుపునిస్తూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవ‌ల బీజేపీయేత‌ర రాష్ట్రాల సీఎంల‌కు లేఖ రాశారు. అయితే ఈ లేఖ‌పై తెలంగాణలో అధికార టీఆర్ఎస్ స్పందించ‌లేదు. ఈ విష‌యంలో పార్టీలోని ఆగ్ర‌నేత‌లంద‌రూ మౌనంగానే ఉన్నారు. గ‌త కొంత కాలం నుంచి బీజేపీపై విరుచుకుప‌డుతున్న టీఆర్ఎస్.. మ‌మ‌తా బెన‌ర్జీ పిలిచినా ఎందుకు సైలెంట్ గా ఉంద‌నే విష‌యం తెలియ‌డం లేదు. 

కాగా మ‌మ‌తా బెన‌ర్జీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎలాంటి లేఖ రాలేదని, అది అందిన త‌రువాత ఆ విష‌యంలో భవిష్యత్ కార్యాచరణ ప్ర‌క‌టిస్తార‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కాగా సీఎం కేసీఆర్ బుధ‌వారం ఉదయం ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ సాయంత్రం వ‌ర‌కు ఆ నిర్ణ‌యంలో మార్పు వ‌చ్చింది. ఢిల్లీ టూర్ ను ఆయ‌న క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఈ టూర్ విష‌యంలో చాలా ఊహాగానాలు వెలువ‌డ్డాయి. ఢిల్లీకి రావాల‌ని మ‌మ‌తా బెన‌ర్జీని సీఎం కేసీఆర్ కోరార‌ని, బీజేపీయేత‌ర ముఖ్య‌మంత్రుల‌ను క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు అనేక వార్తలు వినిపించాయి. 

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాన్ని ప్రారంభించేందుకు ఢిల్లీలో లేదా హైదరాబాద్‌లో బీజేపీయేత‌ర పార్టీల సమ్మేళనం నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గ‌త నెల‌లోనే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే మ‌మ‌తా బెన‌ర్జీ రెండు రోజుల కింద‌ట అన్ని బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాయడం, సీఎం కేసీఆర్ బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని నిర్ణ‌యించుకోవ‌డంతో తెలంగాణలో రాజకీయంగా ఒక్క సారిగా మారిపోయింది. అయితే ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అవ‌డంతో అంతా చ‌ల్ల‌బ‌డింది. అయితే టూర్ నిలిచిపోవ‌డానికి కార‌ణాలు ఏంట‌నే విష‌యం తెలియ‌డం లేదు.

కాగా టీఆర్ఎస్ ఎంపీలు సంద‌ర్భానుసారం కేంద్ర ప్ర‌భుత్వ తీరును పార్ల‌మెంట్ లో నిర‌సిస్తున్నారు. తాజాగా కుల ప్రాతిపదికన జనాభా గణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ సభ్యులు బుధవారం పార్లమెంట్ ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు. సమావేశాలు ప్రారంభమైన వెంటనే కుల ప్రాతిపదికన జనాభా గణనపై చర్చించాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే వాయిదా తీర్మానాలను లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లు తిరస్కరించారు. దీంతో వారు లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ నుంచి నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు, కుల సంఘాలు కులాల వారీగా జనాభా గణన చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయ‌ని తెలిపారు. అయినా కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీలు మండిపడ్డారు. దేశంలో 92 ఏళ్ల క్రితమే కుల గణన నిర్వహించారని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవీ కుల ప్రాతిపదికన జనాభా గణనకు చర్యలు తీసుకోలేదన్నారు. దేశంలో కులాల వారీగా జనాభాపై కచ్చితమైన లెక్కలు లేవని అన్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప‌థ‌కాలు రూపొందించ‌డం కష్టంగా మారిందని చెప్పారు.