హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మీద తెలంగాణ కాంగ్రెసు శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లుభట్టి విక్రమార్క తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా కరోనా వ్యాప్తితో భయం గుప్పిట్లో ఉంటే కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ లో పడుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. 

రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందని, రాష్ట్రంలో ప్రతి రోజూ 3480 టెస్టులు మాత్రమే చేస్తున్నారని, అయినా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఆయన అన్నారు. టెస్టులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రమాదంలో పడిందని ఆయన వ్యాఖ్యానించారు. 

వనరులను అన్నింటినీ ప్రజల ప్రాణాలను కాపాడడానికి వాడాలని ఆయన సూచించారి. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని 50 శాతం పడకలను స్వాధీనం చేసుకోవాలని, వాటిని కరోనాకు కేటాయించాలని, పడకల ఖాళీల వివరాలను ఆన్ లైన్ లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

హైదరాబాదులోని హోటళ్లను కూడా స్వాధీనం చేసుకోవాలని, వాటిని క్వారంటైన్ కోసం వాడాలని మల్లుభట్టి విక్రమార్క సూచించారు. ప్రజలకు భరోసా ఇవ్వాలని ఆయన కోరారు. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రులకు వెళ్తే కరోనా టెస్టులు చేసే వరకు వైద్యం చేయడం లేనది, రిపోర్టులు వచ్చే సరికి ఐదారు రోజులు పడుతోందని ఆయన అన్నారు. ఈ లోగా వ్యాధి ముదిరి చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. 

సీజనల్ వ్యాధులకు చికిత్స చేసే పరిస్థితి కూడా లేదని ఆయన చెప్పారు. కరోనా పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులతో కమిటీ వేయాలని సూచించారు. ఇతర పనుల టెండర్లను ఆపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కరోనా వీదే పూర్తి దృష్టి పెట్టాలని, ప్రైవేట్ విద్యా సంస్థల మీద నియంత్రణ పెట్టాలని ఆయన కోరారు.