తెలంగాణలోని  ఖమ్మంలో నేడు కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ నిర్వహించనుంది. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ‌తో పాలు పలువురు ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.

తెలంగాణలోని ఖమ్మంలో నేడు కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ నిర్వహించనుంది. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ‌తో పాలు పలువురు ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ జనగర్జన సభను ఉద్దేశించి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్టు చేశారు. 3.8 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ జనగర్జన మహా సభలో ప్రజల ఆకాంక్షల కోసం రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని చెప్పారు. అలాగే పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర నిర్వహించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు అభినందనలు తెలిపారు. 

‘‘ఈరోజు 1360 కి.మీ సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసుకున్నందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకి అభినందనలు తెలియజేస్తున్నాం’’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. అలాగే పలువురు సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరి ప్రజాకూటమిని బలోపేతం చేయనున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ సమిష్టి నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ గర్విస్తోందని చెప్పారు. తెలంగాణలో కొత్త ఆవిర్భావానికి తమ బ్లూప్రింట్ సిద్ధమైందని వెల్లడించారు. సామాజిక న్యాయం, సమానత్వం ఆధారంగా తెలంగాణ అభివృద్ధి, పురోగతికి తాము గట్టిగా కట్టుబడి ఉన్నామని చెప్పారు. 

ఇక, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు, కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక సందర్భంగా ఈరోజు ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభను ఏర్పాటు చేస్తుంది. ఈ సభ వేదికగా ప్రసంగించనున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించనున్నారు. రాహుల్ చేయనున్న ప్రసంగంపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. 

విజయవాడ మీదుగా రాహుల్.. 
ఖమ్మంలో జనగర్జన సభకు హాజరయ్యేందుకు వస్తున్న రాహుల్ గాంధీ.. ఢిల్లీ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఏపీ కాంగ్రెస్ నేతలు రాహుల్‌కు స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మంకు చేరుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ సభావేదికపైకి వస్తారు. దాదాపు 1,360 కి.మీ పాదయాత్రను పూర్తిచేసిన భట్టి విక్రమార్కను రాహుల్‌గాంధీ సన్మానించనున్నారు. అదే వేదికపై పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఆయన అనుచరులు, ఇతర నేతలు రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ కండువాలు కప్పుకోనున్నారు. ఇక, ఈ సభ అనంతరం రాహుల్ గాంధీ రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.