Asianet News TeluguAsianet News Telugu

300 రోజుకు చేరిన మల్లన్నసాగర్ రైతుల దీక్ష

మార్చి 31న మల్లన్న సాగర్ నిరాహార దీక్షలో పాలు పంచుకుంటున్న మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, రాజకీయ పక్షాలు, రైతులు
 

mallanna sagar farmers deeksha  crosses 300 days

 

 

 

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ‘మల్లన్న సాగర్’ ప్రాజెక్టుకు 14 ముంపు గ్రామాల బాధిత ప్రజల నుంచి తీవ్ర నిరసన వచ్చింది. పాలకుల దౌష్ట్యానికి చాలా గ్రామాల ప్రజలు నిలువలేకపోయారు. అయినా, 'మేము ఒక్క ఎకరం కూడా యివ్వము ఈ అన్యాయమైన ప్రాజెక్టుకు' అంటూ 2016 జూన్ 5 నుండి ఇప్పటి వరకు 300 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు వేములఘాట్ ప్రజలు. 

 

144 సెక్షన్ పెట్టినా, పోలీసుల్ని ఉసిగొల్పినా,దాడులు చేయించినా, కేసులు పెట్టినా, బెదిరించినా, మొక్కవోని ధైర్యంతో తమ జీవించే హక్కుకోసం నినదిస్తున్న తెలంగాణ చైతన్య గొంతుక అయిన ఈ గ్రామ ప్రజలకు అందరి మద్దతు అవసరం. ఈ ఉద్యమంలో ప్రజా తెలంగాణా తొలినుంచి క్రియా శీల పాత్ర పోషిస్తూ ఉంది.

 

చలో వేములఘాట్. మార్చి 31, 2017

 

2013 భూసేకరణ చట్టం స్ఫూర్తి తుంగలో తొక్కి, తానే స్వయంగా హైకోర్టుకు యిచ్చిన మాట తప్పి, ఎన్నో సార్లు కోర్టు ఉల్లంఘనకు పాల్పడి, గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర జల సంఘాలతో రోజువారీ అక్షింతలు వేయించుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం ఈ గ్రామాలపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నది.

 

అయినా చెదరక, బెదరక నిరసన దీక్షలతో తెలంగాణ చైతన్య గొంతుకకు ప్రతినిధిగా నిలుస్తున్నది వేములఘాట్ గ్రామం. రేపటికి 300 రోజుకు చేరే ఈ మహత్తర ఘట్టానికి అందరం మద్దతు తెలపాలి. అందుకే ‘ఛలో వేములఘాట్’.

 

ఈ నినాదానికి స్పందించి, రేపు మల్లన్న సాగర్ వేములఘాట్ కు టీజాక్ చైర్మన్ కోదండరాం సహా అఖిలపక్ష నాయకులు, కవులు, ప్రజాసంఘాలు, మేధావులు, రచయితలు వస్తున్నారు. 

 

విజయనగర సామ్రాజ్య నిర్మాణ సందర్భంలో కుందేళ్ళు వేటకుక్కలను తరమడం గురించి చదివాం కదా. నేడు మన కళ్ళముందు ఆ దృశ్యాన్ని సాక్షాత్కరింపజేస్తున్నది వేములఘాట్. వేటకుక్కలను తరిమితరిమి కొడుతున్న తెలంగాణ కుందేళ్ళ గ్రామం! తెలంగాణలో ఏదైనా పుణ్యక్షేత్రం ఉంది అంటే అది వేములఘాట్.

 

తెలంగాణ రచయితల వేదిక మల్లన్నసాగర ఘోషపై తెచ్చిన పుస్తకం 'కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా' ఆవిష్కరణ కూడా ఉంది రేపు.అందువల్ల ప్రజలు వేములఘాట్ కు పెద్ద ఎత్తున తరలి వచ్చి మల్లన్న సాగర్ బాధిత రైతులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.

 

ఈ వేములఘాట్ నిరసన ఎందుకు? 

 

నేడు తెలంగాణ అంతటా ఎదురేలేదు అనుకుంటున్న కేసీఆర్ పాలనపై ఒక చిన్న గ్రామం 300 రోజులుగా తిరుగుబాటు బావుటా ఎందుకు ఎగరేస్తున్నది. 144 సెక్షన్ పెట్టినా, పోలీసుల్ని ఉసిగొల్పినా, దాడులు చేయించినా, కేసులు పెట్టినా, బెదిరించినా, ఎందుకు లొంగడం లేదు ఈ గ్రామం.

 

ఎందుకంటే, 50 టీఎంసీల ఆచరణకు అసాధ్యమైన, మేటి ఇంజనీర్లు ఎందరో వద్దంటున్న ఈ 'మల్లన్న సాగర్' ప్రాజెక్టుకు గ్రామం మొత్తం మునిగిపోతుంది కాబట్టి. మరో 13 గ్రామాలు కూడా ముంపునకు గురవుతాయి కాబట్టి. ఏటా 3 పంటలు పండే సారవంతమైన భూములు కాబట్టి. సామాజిక ప్రభావం విపరీతంగా ఉంటుంది కాబట్టి. ఆ అధ్యయనాలు ఏమీ చేయనందున కోర్టులు ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తున్నవి కాబట్టి. నేడు మల్లన్న సాగర్ ప్రజలందరికీ తెలిసిపోయింది ఇది కేవలం కేసీఆర్ కుటుంబ భూదాహం తప్ప లక్ష ఎకరాలకు నీళ్ళు అనేది ఉత్తి మాట అని. అందుకే ఈ నిరసన. అందుకే ఈ తిరుగుబాటు.

 

గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర జలసంఘం, కోర్టులు అందరూ సందేహం వెలిబుచ్చుతున్న, అనుమతులు నిరాకరిస్తున్న ఈ మల్లన్న సాగర్ కు వ్యతిరేకంగా, ఆ వేముల ఘాట్ గ్రామ ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత నేడు తెలంగాణ సమాజంలోని ఆలోచనాపరులపైన ఉన్నది.

 

మల్లన్నసాగర్ గ్రామస్తులతో ‘ప్రజాతెలంగాణ’ అనుబంధానికి కూడా ఒక ఏడాది పూర్తవుతూ ఉంది.ముంపు గ్రామాల ప్రజల దీక్షలకు మద్దతు తెలపడమే కాకుండా, న్యాయాన్యాయాలను పరిశీలించి పరిశోధనలు చేసి “మల్లన్నసాగర్ వెనుక మర్మం ఏంది?” అనే కరపత్రం ద్వారా విస్తృత భావజాల వ్యాప్తి చేసింది ‘ప్రజాతెలంగాణ’. 

 

 ‘నష్టపరిహారం పెంచాలి’ అంటూ యావత్తు ప్రతిపక్షాలు అంటున్నపుడు అసలు ఈ ప్రాజెక్టు అసంభవమని, ప్రభుత్వ లక్ష్యం సాగునీరు అయితే ముందు డీ.పీ.ఆర్ బయట పెట్టమని ముందుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ‘ప్రజా తెలంగాణ’.

 

ఎమ్మార్వో పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయటం అన్యాయమని తేల్చిచెప్పింది ‘ప్రజా తెలంగాణయే’.

 

మల్లన్నసాగర్ అనేది కల్పిత, అసంభవ ప్రణాళిక అని ప్రజలకి తెలిసేలా చేసి, విషయాన్ని నష్టపరిహారం చుట్టూ కాకుండా రిజర్వాయర్ సాధ్యాసాధ్యాల చుట్టూ చర్చించేలా చేసింది ‘ప్రజా తెలంగాణా’.

 

దాదాపు పదివేలకు పైగా వివిధ డాక్యుమెంట్లు సేకరించి, న్యాయపోరాటంలో కీలక పాత్ర పోషించింది ‘ప్రజా తెలంగాణ’.

 

సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, బీజేపీ, తెరవే, రైతు సంఘాల సమాఖ్య – పార్టీలూ, ప్రజా సంఘాలను సమన్వయ పరచి కలెక్టరేట్ ముట్టడిని సుసాధ్యం చేసింది ప్రజా తెలంగాణ.20 వేల కరపత్రాలు, పోస్టర్ ల ద్వారా ప్రభుత్వ అణచివేత దోరణిని ఎండగట్టింది ‘ప్రజా తెలంగాణా’.

 

 

(* శ్రీశైల్ రెడ్డి పంజుగుల ‘ప్రజా తెలంగాణ‘కో-కన్వీనర్. ఆది నుంచీ ఈ పోరులో మల్లన్నసాగర్ గ్రామ ప్రజల పక్షాన నిలబడి, పోరాటానికి ఇతర రాజకీయ పక్షాలతో, ప్రజా సంఘాలతో రైతు సంఘాలతో సమన్వయం చేస్తూవస్తున్నారు. ఇపుడు తనపేరును ఈ పోరాటానికి గుర్తుగా  శ్రీశైల్ రెడ్డి వేములఘాట్ గా మార్చుకున్నారు.)

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios