దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికల్లో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ఓటర్లు టీఆర్ఎస్ కు షాకిచ్చారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో నిర్వాసితులుగా మారిన ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు చేశారు. దీంతో 12వ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించింది.

also read:దుబ్బాక బైపోల్: ఇప్పటివరకు ఆ పార్టీలదే ఆధిపత్యం

కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్వంత మండలం తొగుట. ఈ మండలంలోనే మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ఎనిమిది గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. ఈ గ్రామాల ప్రజలు  పునరావాసం, పరిహారం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు.

మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోసం కాంగ్రెస్, లెఫ్ట్, టీజేఎస్ లు పెద్ద ఎత్తున గతంలో పోరాటం చేశాయి. పరిహారం కోసం నిర్వాసితుల తరపున కొన్ని పార్టీలు కోర్టులను ఆశ్రయించాయి.

ఈ విషయమై కూడ విపక్షాలపై గతంలో టీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోసం తాము మెరుగైన ప్యాకేజీ ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది.

అయితే మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు  టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు చేసినట్టుగా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల గ్రామాల ఓట్లున్న పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లలో టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీలకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ప్రధానంగా 12వ రౌండ్ లోనే ఈ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి..

ఈ రౌండ్ లో కాంగ్రెస్ కు 2080 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 1997 ఓట్లు, టీఆర్ఎస్ కు 1900 ఓట్లు దక్కాయి. దీంతోనే 12వ రౌండ్ లో కాంగ్రెస్ కు ఆధిక్యత వచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తొగుట స్వంత మండలం కావడం కూడ కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఆధిక్యత వచ్చిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.