మల్లన్న సాగర్ కాల్వలకు సీఎం కేసీఆర్ పేరు పెట్టాలి: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
Mallanna Sagar canals-CM KCR: మల్లన్నసాగర్ కాల్వలకు కేసీఆర్ కెనాల్-1, కేసీఆర్ కెనాల్-2 అని పేరు పెట్టాలని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. తక్కువ సమయంలోనే కేఎల్ ఐఎస్ ను పూర్తి చేశారంటూ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు.
Speaker Pocharam Srinivas Reddy: కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని (కేఎల్ఐఎస్) అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన సీఎం కేసీఆర్ ను గౌరవిస్తూ మల్లన్నసాగర్ కాల్వలకు కేసీఆర్ కెనాల్-1, కేసీఆర్ కెనాల్-2 అని పేరు పెట్టాలని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా అవసరాల కోసం నిజాంసాగర్ ప్రాజెక్టును నింపేందుకు నీటిని ఎత్తిపోసే మల్లన్నసాగర్ ప్రాజెక్టు, ఇన్ టేక్ వెల్ ను కామారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టులో భాగంగా సొరంగం కూడా తవ్వుతున్నందున శనివారం టన్నెల్ పనుల పురోగతిని కూడా ఆయన బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన 47 ఏళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. ప్రాజెక్టు పూర్తికి సహకరించిన నాగార్జునసాగర్ కాలువలకు అప్పటి ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి పేర్లను కేంద్ర ప్రభుత్వం పెట్టిందని, తన దూరదృష్టితో చేసిన కృషికి గాను కాలువలకు ఆయన పేరు పెట్టడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. కేఎల్ఐఎస్ ద్వారా 13 జిల్లాల్లోని 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.
కామారెడ్డి జిల్లాకు జీవనాడి అయిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఇప్పటికే కొండపోచమ్మ నుంచి హల్దీవాగు ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీరు వస్తోందని, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులకు 3 వేల క్యూసెక్కుల చొప్పున సరఫరా చేసేలా కాలువను నిర్మిస్తున్నట్లు తెలిపారు. సింగూరుకు ఇన్ ఫ్లో అవసరం లేనప్పుడల్లా 6 వేల క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ లోకి పంపింగ్ చేస్తే కామారెడ్డి జిల్లాలో తాగు, సాగు నీటి ఎద్దడి తీరుతుందని స్పీకర్ తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీ లను నిర్మించి అక్కడి నుండి నీటిని ఎత్తిపోతల పథకాల ద్వారా అనంత సొగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ల లోకి మళ్ళిస్తున్నారు. "కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.75 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుతో పాటుగా వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న మరో 20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. వాగులు, చెరువులు,ఎత్తిపోతల కింద మరికొంత సాగవుతుందని" తెలిపారు.
"13 జిల్లాలు 31 నియోజకవర్గాల లోని 50 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అంది సస్యశ్యామలం అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా 150 నుండి 200 TMC ల నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లు నిర్మించారు. ఒక ఏడాది వర్షాలు లేకపోయినా రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటితో పంటలు సాగు చేయవచ్చు. ఇంత మంచి ప్రాజెక్టును చూసి కొంతమంది అవాక్కులు, చెవాక్కులు మాట్లాడుతున్నారు. వాళ్ళు మంచి పనులు చేయరు, చేసే వాళ్ళను చూసి ఓర్వరు" అని పోచారం పేర్కొన్నారు.
శంకుస్థాపన రోజు ఇంత పెద్ద ప్రాజెక్టు మూడు ఏళ్ళలో పూర్తి చేస్తామంటే ఆశ్చర్యం పోయాం, కానీ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో పూర్తి చేసారని కొనియాడారు. కాగా, ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, నర్సాపూర్ ఎమ్మెల్యే సీహెచ్ మదన్ రెడ్డి, కలెక్టర్ సిద్దిపేట ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.