మంత్రి హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లిపై వేటు పడనున్నట్లు సమాచారం. ఈ మేరకు రంగం సిద్ధమయినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ : బీఆర్ఎస్ లో మైనంపల్లి చిచ్చు రగులుతోంది. దీంతో ఆయనపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సోమవారం నాడు వైద్యరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అవి తన వ్యక్తిగత వ్యాఖ్యలని.. పార్టీ మీద తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. దీంతో మైనంపల్లి మీద రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు విరుచుకుపడుతున్నారు.

బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే హనుమంతరావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. మైనంపల్లి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మేరకు మండిపడుతున్నారు. మైనంపల్లిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ పెరుగుతోంది.

హరీష్ రావుపై నా వ్యాఖ్యలు వ్యక్తిగతం.. పార్టీ గురించి మాట్లాడలేదు.. : మైనంపల్లి

మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మైనంపల్లి హనుమంతరావుపై వేటుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సోమవారం నాడు బిఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసింది. దీని కంటే ముందే మైనంపల్లి మల్కాజిగిరిలో తనకి, తన కుమారుడు రోహిత్ కి మెదక్ సీటు ఇవ్వాలంటూ పట్టు పట్టారు.

రెండు టికెట్లు ఇవ్వకపోతే ఊరుకోబోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మెదక్లో మంత్రి హరీష్ రావు పెత్తనం ఏంటంటూ, ఆయన బట్టలూడదీసేదాకా నిద్రపోను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంత చేస్తానంటూ సవాల్ విసిరారు.

హరీష్ రావు రాజకీయంగా ఎంతోమందిని అణచివేశాడని చెప్పుకొచ్చారు. అక్రమంగా కోట్లు సంపాదించాడని, ఆయన అడ్రస్ సిద్దిపేటలో లేకుండా గల్లంత చేస్తానని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులు మైనంపల్లి హనుమంతరావుపై మండిపడుతున్నాయి. పార్టీ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.