ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు:భారీగా ఆస్తి నష్టం
పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట మార్కెట్ సెంటర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 15 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మంగళవారంనాడు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదాల కారణంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. రెండు రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలకు గల కారణాలపై అథికారులు ఆరా తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట మార్కెట్ సెంటర్ లో మంగళవారం నాడు తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది .షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం వాటిల్లిందని స్థానికులు చెబుతున్నారు. కూరగాయల మార్కెట్ సెంటర్ కు సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఉన్న వర్క్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది.ఈ వర్క్ షాపు నుండి మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా వ్యాపించాయి. దీంతో 15 దుకాణాలు మంటల్లో కాలిపోయాయి. అగ్ని ప్రమాదం కారణంగా కోటి రూపాయాల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా.
మంటలను గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్లు మార్కెట్ సెంటర్ కు సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశాయి. మంటలను అదుపు చేయలేకపోతే మిగిలిన దుకాణాలు కూడ మంటల్లో దగ్దమయ్యేవని స్థానికులు చెప్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకొందని అగ్ని మాపక సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు.
తెలంగాణ రాష్ట్రంలోనూ అగ్ని ప్రమాదాలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల మంగళవారంనాడు తెల్లవారు జామున అగ్ని ప్రమాదాలు జరిగాయి..హైద్రాబాద్ లోని ముషీరాబాద్ లో గల టింబర్ డిపోలో మంటలు వ్యాపించాయి.టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి.
మేడ్చల్ జిల్లాలోని చెంగిచెర్లలో గల స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయంతో అక్కడి నుండి పరుగులు తీశారు.