తెలుగురాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ముక్కంటి దర్శనం కోసం పలు ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.
తెలుగురాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలను సర్వంగ సుందరంగా అలకరించారు. ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ముక్కంటి దర్శనం కోసం పలు ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాళహస్తి, శ్రీశైలం, పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ, మహానంది ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంది. తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయం, ఏడుపాయల వనదుర్గాభవానిమాత ఆలయం, కీసర, కాళేశ్వరం, రామప్ప ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు.
వేములవాడలోని రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. గర్భాలయంలో జరిగే అభిషేక పూజలను అధికారులు రద్దు చేశారు. శని, ఆదివారాల్లో భక్తులందరికీ లఘు దర్శనం కల్పించనున్నారు.రాజన్న దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. వేములవాడ రాజన్న ఆలయంలో ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మరోవైపు కాళేశ్వరంలోని ముక్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ నుంచే నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమ గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. స్వామివారికి మారేడు దళాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచే ఆలయంలో విపరీతమైన రద్దీ నెలకొంది. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు.. స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఈ ఒక్కరోజు దాదాపు రెండు లక్షల మంది శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు ఆలయంలో నందివాహన సేవ నిర్వహించనున్నారు. అనంతరం మల్లికార్జున స్వామికి అభిషేకరం నిర్వహించి.. రాత్రి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకరం, ఆలయానికి పాగాలంకరణ అనంతరం స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం జరపనున్నారు.
పల్నాడు జిల్లాలోని కోటప్పకొండలో శివరాత్రి తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోటప్పకొండ సమీపంలోని గ్రామాలకు చెందిన వారు ప్రభలు కట్టుకుని కొండకు వెళ్లి శివయ్యను దర్శించుకుంటున్నారు. ప్రభుత్వం తరపున స్వామికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సాయంత్రం 6 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. మరోవైపు శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజామునుంచే క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.
