Asianet News TeluguAsianet News Telugu

Free Bus Travel Scheme: బిగ్ అలర్ట్.. ఇకపై ఒరిజినల్ కార్డులు చూపించాల్సిందే.. లేదంటే..!

Mahalakshmi Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందున రాష్ట్ర మహిళలు ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణ సమయంలో మహిళలు పలు సూచనలను పాటించాలని పేర్కొన్నారు. ఇంతకీ ఆ సూచనలేంటీ?   

Mahalakshmi Scheme Tsrtc Md Sajjanar Clarity On Women Should Show Original ID Cards In Buses During Free Bus Travel In Telangana KRJ
Author
First Published Dec 20, 2023, 10:57 PM IST

Mahalakshmi Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి( ఫ్రీ బస్సు) మహిళల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చి 11  రోజుల్లోనే రికార్డు స్థాయిలో మహిళలు టీఎస్​ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. సగటున రోజుకు 30 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారంటే..? మమూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్​ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారని, మహిళల ఉచిత ప్రయాణ స్కీం వలన సంస్థ ఆక్యూపెన్సీ రేషియో(ఓ ఆర్)గణనీయంగా పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఆక్యూపెన్సీ 69 శాతంగా ఉంటే.. ప్రస్తుతం ఆక్యూపెన్సీ 88 శాతానికి పెరిగిందని తెలిపారు. కొన్ని డిపోల్లో 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ నమోదయిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9 న మహాలక్ష్మి (TSRTC Bus Journey Free for Womens) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వల్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందవచ్చు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు.. ఈ నెల 15 నుంచి జీరో టికెట్ ను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్రీ బస్ జర్నీకి విశేష స్పందన వస్తుందనీ, మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఈ పథకం ద్వారా పెద్ద ఎత్తున లబ్ది పొందుతున్నారని సజ్జనార్ పేర్కొన్నారు.

అయితే.. ప్రయాణ సమయంలో మహిళలు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు చూపించాలనీ, జిరాక్స్ లు, స్మార్ట్ ఫోన్​లలో సాప్ట్ కాపీలు చూపిస్తున్న విషయం తమ దృష్టికి వస్తుందనీ, కానీ.. ఫోన్లలో ఫోటోలను చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని,  ఖచ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఓ ఫోటో గుర్తింపు కార్డును కండెక్టర్ కు చూపించాలని సజ్జనార్​ స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. కేవలం తెలంగాణ రాష్ట్ర మహిళలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు యథావిధిగా ఛార్జీలు చెల్లించి, టికెట్ తీసుకోవాలని తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసువస్తామనీ, రానున్న నాలుగైదు నెలల్లో దాదాపు 2,050 కొత్త బస్సులను  అందుబాటులోకి తీసుకవస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios