Asianet News TeluguAsianet News Telugu

Mahalakshmi ఎఫెక్ట్ ... న్యూ ఇయర్ వేళ ప్రయాణికులకు టీఎస్ ఆర్టిసి బ్యాడ్ న్యూస్ 

కొత్త సంవత్సరం ఆరంభంలోనే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టిసి బ్యాడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రకటించిన పలు ఆఫర్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

Mahalakshmi Scheme effect ... TSRTC Cacelled Family24 and T6 Tickets AKP
Author
First Published Dec 31, 2023, 11:11 AM IST

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతర్వాత ఆర్టిసిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆరుగ్యారంటీల్లో ఒకటయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చింది. 'మహాలక్ష్మి' పథకం ద్వారా మహిళలు ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే తెలంగాణ అర్టిసి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ పెరిగి సిబ్బందిపై భారం పెరిగిన నేపథ్యంలో టీఎస్ ఆర్టిసి కీలక నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణవ్యాప్తంగా మహిళా ప్రయాణికులతో ఆర్టిసి బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో మహిళా ఉద్యోగులు, కూలీ పనులకు వెళ్లేవారే కాదు సామాన్య మహిళలు సైతం ఆర్టిసి బస్సులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో బస్సుల్లో రద్దీపెరిగి కండక్టర్లు కనీసం టికెట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోతోంది. అలాంటిది ఫ్యామిలీ-24, టీ‌-6 వంటి ఆఫర్ల కింద టికెట్లు జారీచేయడం కండక్టర్లకు కష్టతరంగా మారింది. దీంతో హైదరాబాద్ లో తక్కువ ఖర్చులో ప్రయాణించేందుకు వీలుగా జారీచేస్తున్న ఇలాంటి టికెట్లను జనవరి 1, 2024 నుండి రద్దు చేస్తున్నట్లు టీఎస్ ఆర్టిసి ఎండీ విసి సజ్జనార్ ప్రకటించారు. 

''ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది'' అంటూ సజ్జనార్ ఎక్స్ వేదికన ప్రకటించారు. 

Also Read  పోకిరీ చేష్టలు కాదు పొట్టకూటి పోరాటం ... జనగామ వందేభారత్ రైలుపై దాడికేసులో ట్విస్ట్

"ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు" అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.

ఏమిటీ ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లు :

తెలంగాణ రాజధాని హైదరాబాద్ చారిత్రాత్మక నగరం. అంతేకాదు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు ఈ నగరంలో కొలువై వున్నాయి. దీంతో హైదరాబాద్ లో పర్యాటక ప్రాంతాలను చూసేందుకే కాదు వివిధ పనులకోసం కుటుంబసమేతంగా హైదరాబాద్ కు వస్తుంటారు. ఇలాంటివారికోసం ఆర్టిసి యాజమాన్యం ప్రకటించిన బంపర్ ఆఫరే ఫ్యామిలీ-24. ఓ రోజంతా నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం కేవలం రూ.300 చెల్లించి రోజంతా ఆర్టిసి బస్సుల్లో హైదరాబాద్ లో ఎక్కడినుండి ఎక్కడివరకైనా ప్రయాణించవచ్చు. కండక్టర్ల వద్ద ఈ టికెట్లను పొందే అవకాశం వుండేది. కానీ మహాలక్ష్మి పథకంతో ఈ టికెట్లను ఆర్టిసి యాజమాన్యం రద్దుచేసింది. 

ఇక మహిళలు, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లలకు సిటీ బస్సుల్లో ప్రయాణంకోసం టీ-6 టికెట్లు అందుబాటులోకి తెచ్చింది టీఎస్ ఆర్టిసి. రూ.50 చెల్లించి
 ఈ టికెట్ తీసుకున్నవారు ఆరు గంటలపాటు ఆర్టిసి బస్సుల్లో ఎక్కడినుండి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. కానీ ఈ టికెట్లు జారీ చేయాలంటూ ఐడీ కార్డుల పరిశీలనకు సమయం పడుతుంది... కాబట్టి వీటిని ఆర్టిసి యాజమాన్యం రద్దు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios