బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన మహబూబ్‌నగర్ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి
తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా బీఆర్ఎస్ కు షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ను వీడుతున్నారు నేతలు.
మహబూబ్ నగర్: బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
also read:తెలంగాణ గవర్నర్: సీ.పీ. రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న వంశీచంద్ రెడ్డి కూడ స్వర్ణ సుధాకర్ రెడ్డితో పాటు ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కూడ ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది.ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు కీలక నేతలకు గాలం వేస్తుంది. మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
also read:తిరుమల: లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపు
మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ను వీడి ఆమె బీఆర్ఎస్ లో చేరారు. గతంలో అమరచింత ఎమ్మెల్యేగా స్వర్ణ సుధాకర్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు.
దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భూత్పూరు నుండి స్వర్ణ సుధాకర్ రెడ్డి జడ్‌పీటీసీగా విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవిని స్వర్ణ సుధాకర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకత్వం అప్పగించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.