న్యూఢిల్లీ: పోతిరెడ్డి పాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలనే ప్రతిపాదనను నిరసిస్తూ పాలమూరు రైతులు బుధవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

పోతిరెడ్డి పాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను  రూ. 7 వేల కోట్ల అంచనాతో చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఈ ఏడాది మే 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది.

ఈ జీవో ను నిరసిస్తూ పాలమూరుకు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ మే 16వ తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఏపీ ప్రభుత్వం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందని ఆయన ఆ పిటిషన్ లో ఆరోపించారు.

దీంతో మే 20వ తేదీన ఈ పనులపై ఎన్జీటీ స్టే ఇచ్చింది. అయితే ఈ విషయమై ఈ నెల 13వ తేదీన ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. 

also read:జగన్‌ సర్కార్‌కు ఎన్జీటీ షాక్: పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ పై స్టే

ఈ పథకం నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక పనులను పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేసింది.మే 20వ తేదీన రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశాలను ట్రిబ్యునల్ సవరించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం రావడంతో పాలమూరుకు చెందిన రైతులు సుప్రీంకోర్టులో బుధవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. 

పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు పూర్తి చేస్తే  పాలమూరు జిల్లాతో పాటు దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  లో పిటిషన్ దాఖలు చేసిన సామాజిక కార్యకర్త శ్రీనివాస్ నేతృత్వంలోనే రైతులు ఈ పిటిషన్ వేశారు.