మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. ఓ వ్యక్తిని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు పిలిచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అతని బంధువులు చెబుతున్నారు. అతడికి అరికాళ్లు, మోకాళ్లు, చేతులపై గాయాలు అయిన దృశ్యాలను వారు మీడియాకు చూపించారు.
మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. భార్యాభర్తల వివాదంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు పిలిచి ఓ వ్యక్తిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అతని బంధువులు చెబుతున్నారు. దీంతో అతడికి అరికాళ్లు, మోకాళ్లు, చేతులపై తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం నడవలేని స్థితికి చేరుకున్నాడు. అతడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. వివరాలు.. భార్యాభర్తల మధ్య గొడవ విషయంలో బానోతు మురళి అనే వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. కేసు విషయమై బయ్యారం ఎస్ఐ రమాదేవి స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో ఎస్ఐ సహా మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తనను తీవ్రంగా కొట్టినట్టుగా మురళి చెప్పాడు.
మురళీని అతడినబంధువులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మురళీ బంధువులు చెబుతున్నారు. మురళీకి అరికాళ్లు, మోకాళ్లు, చేతులపై గాయాలు అయిన దృశ్యాలను వారు మీడియాకు చూపించారు. పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విచారణ చేపట్టి ఎస్సై రమాదేవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మురళీ బంధువులతో పాటు ప్రజా సంఘాల నేతలు పోలీస్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులను కలిసి ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని వారు చెబుతున్నారు.
భార్యాభర్తలకు సంబంధించిన అంశాల్లో కేవలం కౌన్సెలింగ్ మాత్రమే చేయాల్సిన పోలీసులు.. మురళీపై థర్డ్ డిగ్రీ ప్రయోగం ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. అయితే ఈ పరిణామాలపై పోలీసులు నుంచి ఎటువంటి స్పందన లేకుండా పోయింది.