మహబూబాబాద్:  తాను ఎర్రబస్సు మీద రాలేదంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్  ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు సైడ్ రోమియోను కాదు.. ఆర్‌ఈసీలో చదువుకొన్నానని ఆయన చెప్పారు. 

also read:వేములవాడలో దారుణం: మద్దతివ్వలేదంటూ శివపై మాజీ కౌన్సిలర్ కత్తితో దాడి

బుధవారం నాడు మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్ఆర్‌ఎస్‌పీ, చిన్న నీటి వనరులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్  అధికారులపై మండిపడ్డారు.  తాను లేకుండానే  సమావేశం నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. 

తాను రాకుండానే అధికారులతో సమీక్ష సమావేశం ఎలా నిర్వహిస్తారని  ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రశ్నించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం సమావేశం సందర్భంగానే  లంచ్ తర్వాత ఈ సమావేశం నిర్వహించాలని చెబుతానని చెప్పారని మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యేకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.

పట్టణ ప్రగతి కార్యక్రమం సాగుతున్న సమయంలో  ఈ సమీక్ష నిర్వహించడమే తప్పు అని  ఆయన మండిపడ్డారు. మైసమ్మ చెరువు, నిజాం చెరువు,  బంధం చెరువులకు ఎస్ఆర్‌ఎస్‌పీ నీళ్లు ఎందుకు రావడం లేదని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రశ్నించారు.

మైసమ్మ చెరువుకు తన స్వంత నిధులతో ఫీడర్ చానల్‌ను నిర్మించినట్టుగా  ఆయన తెలిపారు.  తన స్వంత నిధులతో ఈ పనులు చేయాలా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ పనులు చేయడానికి ఎన్ని రోజులు పడుతోందని ఎస్ఈ‌ని ప్రశ్నించారు ఎమ్మెల్యే శంకర్ నాయక్.ఈ సమయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు క్షమాపణ చెప్పారు.  దీంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్  శాంతించారు. 

ఈ సమయంలోనే ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొంత ఆగ్రహంగా మాట్లాడారు. తాను ఎర్ర బస్సు ఎక్కి రాలేదన్నారు. 18 ఏళ్ల పాటు అధికారిగా కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి పనిచేసినట్టుగా గుర్తు చేశారు. అధికారులతో ఎలా ఉండాలో తెలుసుననన్నారు. తాను ఆర్ఈసీలో చదువుకొన్నానని గుర్తు  చేశారు. గౌరవం ఇచ్చుకోవాలి.. గౌరవం తీసుకోవాలంటూ ఆయన అధికారులపై మండి పడ్డారు.