ఈ అమ్మాయి ప్రేమించిన యువకుడి చేతిలో మోసపోయింది. నమ్మించి మోసం చేసిన వ్యక్తికి గుణపాఠం చెప్పేందుకు రంగంలోకి దిగింది. తాడో పేడో తేల్చుకుంటానని ప్రతినబూనింది. ఇంతకూ ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం.. మదనతుర్తికి చెందిన అనూష, తొర్రూరుకు చెందిన ఎన్. ప్రశాంత్ ఇద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అంతేకాదు ఇటీవల కాలంలో మదనతుర్తిలోని ఒక గుడిలో దండలు మార్చుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దానికి ప్రశాంత్ అంగీకరించలేదు. దీంతో తనకు అన్యాయం చేసిన ప్రశాంత్ మీద పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఆ యువతి.

అంతేకాదు.. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తొర్రూరులో ఉన్న తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ విషయంలో అధికారులు తనకు న్యాయం చేయాలని అనూష కోరుతున్నది. ప్రశాంత్ ఇంటి ముందు అనూష బైటాయించడాన్ని చూసిన స్థానిక మహిళా సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. ఆమె ఆందోళనకు మద్దతు పలికారు. ఆమెకు న్యాయం చేయాలని స్థానిక మహిళా సంఘం నేతలు విజయ, దేవమ్మ, లలిత, ధనలక్ష్మి కోరారు.

అయితే ప్రశాంత్ కుటుంబసభ్యులు ఈ విషయం తెలిసి ఇంట్లో లేకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. అనూష ఆందోళన కొనసాగిస్తానని ప్రకటించారు. హైదరాబాద్ లో ఇటీవల కాలంలో జరిగిన సంగీత ఇష్యూలాగే ఇది కూడా ఉందని తెలిసిన వారు అంటున్నారు.