మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు సమావేశమవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. 

మహబూబాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అధికార బిఆర్ఎస్ తో ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లో టికెట్ల లొల్లి మొదలయ్యింది. మహబూబ్ నగర్ బిఆర్ఎస్ పార్టీలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పై సొంత పార్టీ నేతలే ఎదురుతిరిగారు. శంకర్ నాయక్ కు బిఆర్ఎస్ టికెట్ ఇవ్వవద్దని... కాదని ఆయనకే మళ్ళీ అవకాశమిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. 

మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లులోని ఓ మామిడి తోటలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యతిరేకవర్గం సమావేశమయ్యింది. మహబూబాబాద్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో ముగ్గురు కౌన్సిలర్లతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ శంకర్ నాయక్ కు కాకుండా వేరే ఎవరికైనా ఇవ్వాలని బిఆర్ఎస్ అదిష్టానాన్ని కోరాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 

సమావేశం అనంతరం వెంకన్న గౌడ్ మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ గత రెండుసార్లుగా శంకర్ నాయక్ కు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిందన్నారు. కానీ గెలిపించిన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆయన పట్టించుకోలేదుకదా అణగదొక్కే ప్రయత్నం చేసారన్నారు. ఇక భూకబ్జాలతో పాటు రౌడీయిజం చేస్తూ రక్తపాతం సృష్టించాడని ఆరోపించారు. ఇలా సొంత పార్టీ నాయకులే కాదు ప్రజలు కూడా శంకర్ నాయక్ కు దూరమయ్యారు కాబట్టి ఈసారి ఆయన గెలిచే అవకాశమే లేదని పేర్కొన్నారు. కాబట్టి వేరే ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అందరం కలిసికట్టుగా పనిచేసి బిఆర్ఎస్ ను గెలిపించుకుంటామని వెంకన్న గౌడ్ తెలిపారు. 

Read More ఆయనో అవినీతి తిమింగళం.. నా దగ్గర పుస్తకమే వుంది, బయటపెడతా : కడియంపై రాజయ్య సంచలన వ్యాఖ్యలు

అయితే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం సమావేశం వెనక ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు వున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేయాలని భావిస్తున్న ఆయనే తన వర్గంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేయిస్తున్నట్లు సమాచారం. తాజాగా శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వొద్దంటూ సమావేశమైన బిఆర్ఎస్ నాయకులంతా ఎమ్మెల్సీ వర్గీయులేనని తెలుస్తోంది. 

అయితే వ్యతిరేక వర్గం సమావేశంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గం కూడా అప్రమత్తమయ్యింది. మహబూబాబాద్ అభివృద్దికి పాటుపడుతున్న ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడటం తగదని జడ్పిటిసి శ్రీనాథరావు, ఎంపిపిలు పేర్కొన్నారు. తమ నాయకుడు శంకర్ నాయక్ ను విమర్శిస్తే సహించేది లేదంటూ వ్యతిరేక వర్గాన్ని హెచ్చరించారు.