TSRTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. మార్గదర్శకాలు ఇవే..
Free Bus Journey for Women: తెలంగాణ ప్రభుత్వం మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించిన జీవో జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, ప్రయాణికులకు అంతరాయం లేని ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఆర్టీసీ లక్ష్మి స్మార్ట్ కార్డును అభివృద్ధి చేసే పనిలో పడింది.
Telangana Maha Lakshmi Scheme: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు హామీల్లో మొదటిది మహా లక్ష్మి పథకం. శనివారం దీనిని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. నేపథ్యంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తూ రవాణా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో నివసిస్తున్న అన్ని వయసుల బాలికలు, మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.వాణీప్రసాద్ జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు. డిసెంబర్ 9 నుంచి పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు.
ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జీవోలో పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. సాఫ్ట్‌వేర్ ఆధారిత లక్ష్మి స్మార్ట్ కార్డ్‌ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటోంది.
ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇవే..
1. తెలంగాణకు చెందిన అన్ని వర్గాల, అన్ని వయస్సుల ఆడబిడ్డలకు మహాలక్ష్మీ పథకం కింద పూర్తిగా ఉచితంగా రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు.
2. డిసెంబర్ 9 నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు ప్రయాణం చేయవచ్చు. ఉచిత ప్రయాణం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉంటుంది.
3. జిల్లాల్లో రాష్ట్ర సరిహద్దులోపల తిరిగే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ లలో ఉచిత ప్రయాణం చేయవచ్చు.
4. నగరాల్లో అయితే, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
5. ఇతర రాష్ట్రాల్లోకు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణ సరిహద్దుల వరకు ఉచిత ప్రయాణం ఉంటుంది. సరిహద్దులు దాటితే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
6. ప్రస్తుతం ఏదైన ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. ఆర్టీసీ మహాలక్ష్మీ స్మార్ట్ కార్డులను అందిస్తున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.