దొంగల క్రియేటివిటీ రోజురోజుకూ కొత్త దారులు తొక్కుతోంది. చిన్న పిల్లలు అదీ అద్దెకు తీసుకువచ్చిన పిల్లలతో భారీ స్థాయిలో చోరీలు చేస్తున్న ఓ ముఠాలోని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అతిథుల్లా వచ్చి అద్దె పిల్లలతో  35 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. 

ఈ కేసు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని మూడు గ్రామాలు ఈ తరహా దొంగలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తేలింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతోపాటు చోరీసొత్తును రికవరీ చేసినట్లు తెలిసింది. కేసు వివరాలను నేడో, రేపో పోలీసులు అధికారికంగా వెల్లడించనున్నారు. మధ్యప్రదేశ్‌, రాజ్‌ఘడ్‌ జిల్లాలోని మూడు గ్రామాలు గులాఖేరి, కడియ, సుల్‌ఖేరిలు రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉంటాయి. 

ఈ గ్రామాలకు చెందిన కొంతమంది దొంగతనం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇందుకోసం 12 ఏళ్లలోపు పిల్లల్ని అద్దెకు తీసుకుంటారు. ఫంక్షన్‌కు వచ్చేవారిలో కలసి పోవడం, బంగారం ఎక్కువగా ధరించినవారితో మాటలు కలపడం, చాకచక్యంగా సొత్తు తస్కరించడం వంటివి వారికి నేర్పిస్తున్నారు. 

ముఖ్యంగా ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన పిల్లలను ఎక్కువగా అద్దెకు తీసుకుంటారు. పిల్లల తల్లిదండ్రులకు ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఫంక్షన్‌హాల్‌కు ఖరీదైన వాహనంలో వస్తారు. ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లలో మత్తు మందు కలిపి ‘టార్గెట్‌’చేసిన వారికి ఇస్తారు. వారు మత్తులోకి జారగానే బంగారం తీసుకుని పరారవుతారు.

గత డిసెంబర్‌లో నిజామాబాద్‌ జిల్లాలో ఈ తరహాలోనే నిందితులు భారీ చోరీ చేశారు. డిచ్‌పల్లి మండలం ధర్మారంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరుగుతున్న పెళ్లి వేడుకలోకి ప్రవేశించారు. ముగ్గురు బయట కారులో వేచి చూడగా.. బాలుడు, మరో ఇద్దరు లోనికి వెళ్లారు. 

పెళ్లి కుమార్తె మెడలో డైమండ్‌ హారంతోపాటు భారీగా బంగారం ఉండటంతో తస్కరించాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి కూతురి గదిలోకి వెళ్లిన బాలుడు ఆమెకు మత్తు మందు ఇచ్చి, డైమండ్‌ నెక్లెస్‌, 35 తులాల బంగారం తస్కరించారు. అనంతరం ఆరుగురు కారులో పరారయ్యారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సీసీ టీవీ ఫుటేజ్‌లో బాలుడు సహా నిందితులు పారిపోతున్న దృశ్యాలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు.