హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ  రాష్ట్ర కమిటీలో నాయకత్వ మార్పు అవసరమని ఎఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లుగా పీసీసీ చీఫ్ గా ఒకే వ్యక్తి ఉన్నారని ఆయన చెప్పారు. 

టీపీసీసీ చీఫ్ ను వెంటనే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నాయకత్వ మార్పుకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.  మధుయాష్కీ తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి.

దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత పార్టీ ప్రక్షాళన జరుగుతోందన్నారు. ఓటమికి బాధ్యులు ఎవరనేది ఠాగూర్ తేల్చుతారని ఆయన చెప్పారు.పీసీసీ మార్పుపై ఇంచార్జీలకు రాహుల్ గాంధీ బాధ్యతను అప్పగించారని ఆయన గుర్తు చేశారు.అన్ని ఎన్నికల్లో ఓటమితో పార్టీ క్యాడర్ కొంత అసంతృప్తితో ఉందని ఆయన చెప్పారు.

కొంతకాలంగా  పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలని కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ నెలకొంది. పీసీసీ చీఫ్ పోస్టు కోసం చాలా మంది పోటీలో ఉన్నారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక పీసీసీ చీఫ్ ను మార్చే అవకాశం లేకపోలేదు.

వచ్చే ఏడాది ఆరంభం నాటికి పీసీసీ చీఫ్ గా కొత్త వ్యక్తి పగ్గాలు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీగా బాధ్యతలు చేపట్టిన మాణికం ఠాగూర్ మాత్రం పీసీసీ మార్పుపై విషయంలో సానుకూల సంకేతాలు ఇవ్వలేదు. పీసీసీ చీఫ్ మార్పు విషయాన్ని సోనియా గాంధీ చూసుకొంటారని ఆయన ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.