Asianet News TeluguAsianet News Telugu

పీసీసీ వచ్చినా.. ఇంకే పదవి దక్కినా అణకువగా వుండాలి : మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

పీసీసీ అయినా, ఇంకేదైనా పదవి వచ్చినోళ్లు అణుకువగా వుండాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు సీనియర్లు, జూనియర్లు అనే భేదం లేదని.. తాము ఎవరికీ వ్యతిరేకంగా సమావేశాలు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. 
 

madhu yashki goud sensational comments on crisis in telangana congress
Author
First Published Jan 5, 2023, 9:15 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అయినా, ఇంకేదైనా పదవి వచ్చినోళ్లు అణుకువగా వుండాలని మధుయాష్కీ హితవు పలికారు. తాము ఎవరికీ వ్యతిరేకంగా సమావేశాలు పెట్టలేదని.. పార్టీ బాగుకోసం సమావేశం పెట్టామన్నారు. తమకు సీనియర్లు, జూనియర్లు అనే భేదం లేదని మధుయాష్కీ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు మంచి రోజులు రావాలని.. వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ పార్టీలో తెలంగాణ పేరు లేకుండా చేశారని మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసమైతే.. తెలుగు రాష్ట్రాల విభజన కోసం ఎందుకు కొట్లాడావంటూ కేసీఆర్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్ వచ్చాక సమిష్టిగా నిర్ణయాలుంటాయని మధుయాష్కీ తెలిపారు. కర్ణాటకలో బస్సు యాత్ర చేస్తున్నారని.. తెలంగాణలోనూ చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ALso Read: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్‌ .. మాణిక్యం పోయే, మాణిక్‌రావు వచ్చే

ఇకపోతే.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగోర్ స్థానంలో కొత్తగా మాణిక్ రావ్ ఠాక్రే‌ను నియమించింది హైకమాండ్. అటు మాణిక్యం ఠాగోర్‌కు గోవా ఇంచార్జిగా బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ పేరిట బుధవారం ప్రకటన విడుదలైంది. అంతకుముందే మాణిక్యం ఠాగూర్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు ఆయన రాజీనామా లేఖ సమర్పించిన కొద్దిసేపటికే హైకమాండ్ నుంచి ప్రకటన విడుదలైంది.

కాగా.. గత కొంతకాలంగా ఠాగూర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. విభేదాలు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్. ఆయన రిపోర్టుతో తెలంగాణకి కొత్త ఇన్‌ఛార్జ్‌ని నియమించాలని హైకమాండ్ నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. తమ మాటకు గాంధీ భవన్‌లో విలువ వుండటం లేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన పలువురు నేతలు ఠాగూర్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios