ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంలోనే తాము నడుస్తామని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సా పడొద్దని ఆయన అన్నారు.
ఈ దేశం సమగ్రంగా వుండాలంటే అది కాంగ్రెస్ వల్లే (congress) సాధ్యమన్నారు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (madhu yashki goud) . శనివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశాభివృద్ధి సోనియా (sonia gandhi) , రాహుల్ (rahul gandhi) నాయకత్వంలోనే జరుగుతుందని టీపీసీసీ (tpcc) విశ్వసిస్తుందని మధుయాష్కీ చెప్పారు. ఇవాళ జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కౌన్సిల్‌లో జీవన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు (revanth reddy) మిగిలిన సీనియర్ కాంగ్రెస్ నేతలతో మాట్లాడారని ఆయన చెప్పారు.
సోనియా , రాహుల్ గాంధీల నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తూ తీర్మానం చేశామని మధుయాష్కీ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక శ్రమించిన తీరును ఆయన ప్రశంసించారు. సోనియా, రాహుల్ నాయకత్వాలను బలపరుస్తూ.. ఈ క్లిష్ట పరిస్ధితుల్లో వారికి పూర్తిగా అండగా వుంటామని మధుయాష్కీ పేర్కొన్నారు. 1984లో బీజేపీకి రెండు సీట్లే వుండేవని.. అలాంటి పార్టీ ఏ విధంగా ఎదిగిందో.. 2003లో ఎలా ఓడిపోయిందో అందరికీ తెలుసునన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సా పడొద్దని, ఈ ఓటమి తప్పకుండా సమీక్షించాల్సిందేనని మధుయాష్కీ అన్నారు.
కాగా.. ఐదు రాష్ట్రాలకు (ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్) జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం జరుగనుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు.
అంతకంటే ముందు… కాంగ్రెస్ లో అసంతృప్త నేతలుగా (గ్రూప్ 23)ముద్ర పడిన కొందరు.. సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇంట్లో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం, ఇతరత్రా అంశాలపై చర్చించారు. ఈ భేటీకి సీనియర్ నేతలు కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారి తదితరులు హాజరయ్యారు. ఫలితాలతో తాను దిగ్భ్రాంతికి గురైనట్లు, ఇలా పతనం అవుతుండడం చూడలేకపోతున్నా అంటూ… గులాంనబీ ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధినాయకత్వం గమనించి దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు ఆజాద్ వెల్లడించారు. మరికొంత మంది నేతలు కూడా ఆయనతో ఏకీభవించారు.
మరోవైపు..ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని ఇతర పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీజేపీని ఎలాగైనా ఎదుర్కోవాలని ఎన్నో రోజులుగా కాంగ్రెస్ చేస్తోన్న ప్రయత్నాలన్నీ తాజా ఎన్నికల ఫలితాలతో బెడిసికొట్టినట్లయ్యింది. 2014 నుంచి దేశంలో 45 సార్లు ఎన్నికలు జరిగితే హస్తం పార్టీ కేవలం నెగ్గింది ఐదు మాత్రమే. ఇప్పుడు రాజస్థాన్, ఛత్తీస్ గడ్ లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవడం, అంతర్గత కలహాలు, నేతల మధ్య అభిప్రాయ భేదాలతో కాంగ్రెస్ పతనానికి కారణమౌతున్నాయి.
