Asianet News TeluguAsianet News Telugu

Kumari Aunty : అసలు ఎవరీ కుమారి ఆంటీ... ఏమిటా కథ..?

హైదరాబాద్ మాదాపూర్ లో రోడ్డుపక్కన ఫుడ్ సెంటర్  నిర్వహించే ఓ సాధారణ మహిళ తెగ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇలా ఫేమస్ కావడం ఆమె ఫుడ్ బిజినెస్ కే ఎసరు తెచ్చిపెట్టింది... ఎలాగంటే.... 

Madhapur police registered case on Street food Kumari Aunty AKP
Author
First Published Jan 31, 2024, 7:32 AM IST

హైదరాబాద్ : కుమారి ఆంటీ... సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఇటీవల బాగా వినిపిస్తున్న పేరిది. హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ నిర్వహించుకునే సాధారణ మహిళే ఈ  కుమారి... ఆమెను సోషల్ మీడియా తెగ ఫేమస్ చేసింది. ఎంతలా అంటే సినిమా ప్రమోషన్స్ కోసం సినీతారలు సైతం ఆమె వద్దకు వచ్చేంతలా. ఇలా కాలం కలిసొచ్చి చాలా తక్కువకాలంలోనే చాలా ఫేమ్ రావడంతో కుమారి ఫుడ్ బిజినెస్ మరింత ఊపందుకుంది. ఇలా మూడు పువ్వులు ఆరు కాయలుగా కుమారి ఫుడ్ బిజినెస్ సాగుతున్న సమయంలో ఆమెకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు.

 సోషల్ మీడియా కుమారి ఆంటీ ఫుడ్ వీడియోస్ తెగ వైరల్ అవుతుండటంతో అక్కడి భోజనానికి గిరాకీ పెరిగింది. ఒక్కసారయినా అక్కడ తినాలని ఎక్కడెక్కడి నుండో కుమారి ఆంటి ఫుడ్ సెంటర్ కు ప్రజలు వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోతోంది. అయితే రోడ్డుపక్కనే ఈ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తుండటంతో వచ్చినవారంతా తమ వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారు... దీంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి వుండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ను అడ్డుకున్నారు. అంతేకాదు ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదుచేసారు.  

Also Read  Kumari Aunty: కుమారీ ఆంటీ బిజినెస్ క్లోజ్.. మద్దతుగా నిలిచిన యంగ్ హీరో..

ఇలా ఓ సాధారణ మహిళను సోషల్ మీడియా ఎంతలా అయితే ఫేమస్ చేసింది ఇప్పుడు అంతలా ఇబ్బంది పెడుతోంది. కుమారి ఆంటీ పరిస్థితి ఇప్పుడెలా తయారయ్యిందంటే తన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టకండి మహాప్రభో అంటున్నారు. దయచేసి తన ఫుడ్ సెంటర్ వద్దకు ఫుడ్ వ్లాగర్స్, సోషల్ మీడియా,  మీడియా ప్రతినిధులు ఇక రావొద్దని... కుటుంబ పోషణకోసం చేసుకుంటున్న ఫుడ్ బిజినెస్ సజావుగా సాగేలా సహకరించాలని కోరుతున్నారు. అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా జాగ్రత్త పడతామని...దయచేసి తమ ఫుడ్ సెంటర్ ను అడ్డుకోవద్దని పోలీసులను కోరుతున్నారు కుమారి ఆంటీ.  ఈ విజ్ఞప్తితో అయినా ఆమె ఫుడ్ బిజినెస్ సజావుగా సాగుతుందేమో చూడాలి. 

అసలు ఎవరీ కుమారి ఆంటీ?

ఆంధ్ర ప్రదేశ్ లోని గుడివాడకు చెందిన దాసరి సాయికుమారి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. మొదట్లో ఆమె భర్త ఆటో నడిపి కుటుంబపోషణ చూసుకునేవాడు... కానీ అదంత లాభసాటిగా లేకపోవడంతో ఏదయినా బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గతంలో హోటల్ నిర్వహించిన అనుభవం వుండటంతో ఇదే బిజినెస్ చేయాలని భావించాడు... అనుకున్నట్లే మాదాపూర్ లోని కోహినూర్ హోటర్ ఎదురుగా రోడ్డుపక్కనే ఫుడ్ స్టాల్ ఏర్పాటుచేసాడు. భార్య కుమారికి ఆ ఫుడ్ సెంటర్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాడు. 

తమ ఫుడ్ సెంటర్ కు వచ్చేవారితో కుమారి ఎంతో ఆప్యాయంగా పలకరించడం... ఎంతో ప్రేమతో ఆహార పదార్థాలు వడ్డించడం చేసేది. అంతేకాదు వెజ్, నాన్ వెజ్ రుచులు  అద్భుతంగా వుండటంతో రోజురోజుకు ఆమె ఫుడ్ సెంటర్ కు గిరాకీ పెరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల ఉద్యోగులు, చిరువ్యాపారాలు చేసుకునేవారు కుమారి వద్దే భోజనం చేసేవారు... అక్కడికి రెగ్యులర్ గా వచ్చే యువత ఆంటీ ఆంటీ అంటూ అడిగిమరీ రుచికరమైన భోజనాన్ని తీసుకునేవారి. దీంతో కుమారి కాస్త కుమారి ఆంటీగా మారిపోయారు. 

సోషల్ మీడియా ఎంట్రీతో కుమారి ఆంటీ పరిస్థితి చేంజ్ 

హాయిగా సాగుతున్న కుమారి జీవితంలోకి సోషల్ మీడియా ఎంటరై రచ్చరచ్చ చేసింది. ఫుడ్ వ్లాగ్స్ చేసేవారికి కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ లో రుచికరమైన భోజనం లభిస్తుందని తెలిసింది. దీంతో వీడియోలు తీసుకుని యూట్యూబ్ తో పాటు మిగతా సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టేసారు. అక్కడినుండి కుమారీ ఆంటీ జీవితం మరో టర్న్ తీసుకుంది. 

తన ఫుడ్ సెంటర్ లో భోజనం చేయడానికి వచ్చేవారితో చిన్నా, నాన్న అంటూ ఆప్యాయంగా పలకరించడం... ఏయే ఆహారపదార్థాలు వున్నాయి, వాటి ధరలెంతో చెప్పే విధానం జనాలకు బాగా నచ్చింది. ఇది గమనించిన మీమర్స్ కుమారిపై మీమ్స్ చేయడం ప్రారంభించారు. ''నాన్న మీ బిల్ వెయ్యి రూపాయలు... లివర్ ఎక్ట్రా'' అంటూ కుమారి ఆంటీ మీమ్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

ఇలా తన ఫుడ్ సెంటర్ వీడియోలు, మీమ్స్ వైరల్ కావడంతో కుమారి ఆంటీ తెగ ఫేమస్ అయ్యారు. ఆమె ఫుడ్ సెంటర్ కు గిరాకీ కూడా బాగా పెరిగింది. ఇలా కొద్దిరోజులుగా కుమారి ఫుడ్ బిజినెస్ పూర్తిగా మారిపోయింది... ఇలా తెచ్చిన ఆహార పదార్థాలు అలా అయిపోతున్నాయి. దీంతో సోషల్ మీడియా పుణ్యమా అని తాను ఫేమస్ కావడమే బిజినెస్ కూడా బాగా సాగుతోందని  అనుకుంటున్న సమయంలోనే కుమారి ఆంటీకి పోలీసులు షాక్ ఇచ్చారు. 

మాదాపూర్ ట్రాఫిక్ జామ్ ...  కుమారి ఆంటీపై పోలీస్ యాక్షన్ 

కుమారి నిర్వహించే ఫుడ్ సెంటర్ లో భోజనం చేయడానికి భారీగా జనాలు వస్తున్నారు... వారంతా తమ వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయని నిర్దారించుకున్న పోలీసులు కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ను క్లోజ్ చేసారు. అంతేకాదు ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదయినట్లు తెలుస్తోంది. దీంతో కుమారి ఆంటీ దంపతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనాధారమైన ఫుడ్ సెంటర్ ను మూసివేయడం తగ్గదని... పొట్ట కొట్టవద్దని పోలీసులను కోరుతున్నారు. 

తాజా పరిణామాలతో కుమారీ ఆంటీ ఇక తనను ఫేమస్ చేయవద్దని... ఫుడ్ సెంటర్ లో వీడియోలు తీయవద్దని ఫుడ్ వ్లాగర్స్, మీడియావాళ్లను కోరుతున్నారు. ప్రశాంతంగా తన బిజినెస్ ఏదో తనను చేసుకోనివ్వాలని కోరుతున్నారు. గతంలో మాదిరిగా ప్రశాంతంగా తన పనేదో తాను చేసుకునేలా చూడాలని... ఇకపై వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం, మీడియాలో ప్రసారం చేయడం ఆపాలని కుమారి ఆంటీ కోరుతున్నారు. 

కుమారి ఆంటీ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ :

కుమారి ఆంటీ వివాదం పెద్దది కావడంతో దాన్ని పరిష్కరించేందుకు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ పై   నమోదు చేసిని కేసును పున:పరిశీలించాలని సీఎం పోలీసులు, జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. గతంలో నిర్వహించిన స్థలంలోనే ఆమె ఫుడ్ బిజినెస్ నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారులకు నిర్ణయం తీసుకున్నారు.  అంతేకాదు త్వరలోనే కుమారీ ఆంటీ  ఫుడ్ సెంటర్ ను తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి సందర్శించనున్నట్లు తెలుస్తోంది. సామాన్యురాలి గురించి సీఎం రేవంత్ స్పందించడంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కదా ప్రజాపాలన అంటే అని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios