Asianet News TeluguAsianet News Telugu

ప్రేయసి హత్య, ప్రియుడి ఆత్మహత్య : మాదాపూర్ హోటల్ రూమ్ లో మూడో వ్యక్తి ?

ఈ ఘటనపై అనేక అనుమానాలున్నాయని మృతుల కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ హోటల్ గదిలో ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంతోషి సోదరుడు రాఘవేంద్ర మాట్లాడుతూ తమ చెల్లెలు కానిస్టేబుల్ ఉద్యోగం  కోచింగ్‌ కోసం 15 రోజుల క్రితం దిల్షుక్ నగర్ కు వచ్చిందన్నారు.

madhapur lemon tree hotel suicide case, family suspects 3rd person in the room
Author
Hyderabad, First Published Jul 31, 2021, 10:07 AM IST

మాదాపూర్లోని లెమన్ ట్రీ హోటల్ లో గురువారం జరిగిన హత్య, ఆత్మహత్య ఘటన నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు లేవనెత్తుతున్న అనుమానాలు కేసును మరో మలుపు తిప్పుతున్నాయి. అలాగే పోస్టుమార్టం నివేదిక కూడా కొత్త అనుమనాలను కలిగిస్తోంది. ఉరికి ముందే మృతుడి గొంతుకోసి ఉందని తేలడంతో.. ఆ హోటల్ గదిలో వారిద్దరూ కాకుండా.. మరో మూడో వ్యక్తి కూడా ఉన్నాడా అనే ప్రశ్న తలెత్తుతోంది.

మాదాపూర్ లో గురువారం జరిగిన హత్య, ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వికారాబాద్ లగచర్ల గ్రామానికి చెందిన  సంతోషి, మహబూబ్నగర్ జిల్లా కోసిగికి చెందిన రాములు చిన్నప్పటినుంచి స్నేహితులు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

కులాలు వేరు కావడంతో  రాములు ఇంట్లో వారు ఈ పెళ్లికి అభ్యంతరం తెలిపారు. ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని సంతోషి, రాములుపై ఒత్తిడి తెచ్చే ది. ఈ విషయమై చర్చించి, నిర్ణయం తీసుకోవడానికి మాదాపూర్లోని ఓ హోటల్ కు బుధవారం మధ్యాహ్నం 12:30 కు వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

మొదటి రోజు గదిలో బాగానే ఉన్నారు.  మరుసటి రోజు పెళ్లికి సంబంధించి వాదోపవాదాలు జరిగాయి. పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని.. తానేమీ చేయలేని స్థితిలో ఉన్నానని సంతోషికి రాములు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. పెళ్లికి సంతోషి పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. క్షణికావేశానికి లోనైన రాములు సంతోషిని బ్లేడ్తో బాత్రూంలో గొంతుకోశాడు. 

తీవ్రంగా రక్తం కారుతుండడంతో ఆమె గొంతుకు టవల్ అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేసింది. అయినా రక్తం ఆగకపోవడంతో బాత్రూంలో పడిపోయింది.  చనిపోయిందని నిర్ధారించుకున్న రాములు అదే బ్లేడుతో గొంతు కోసుకుని ఆ తర్వాత ఆమె చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే వారిద్దరూ కొద్ది నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలున్నాయని మృతుల కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ హోటల్ గదిలో ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంతోషి సోదరుడు రాఘవేంద్ర మాట్లాడుతూ తమ చెల్లెలు కానిస్టేబుల్ ఉద్యోగం  కోచింగ్‌ కోసం 15 రోజుల క్రితం దిల్షుక్ నగర్ కు వచ్చిందన్నారు.

తమ కుమారుడికి ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేదని శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని రాములు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ గదిలో మూడో వ్యక్తి ఉండి తమ కుమారుడిని కూడా హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.  గొంతు కోసుకున్న తర్వాతే రాములు ఉరివేసుకున్నాడని పోస్టుమార్టంలో వైద్యులు ధ్రువీకరించారు.  స్వరపేటిక  తెగినట్లు పోస్టుమార్టంలో తేలినట్లు సమాచారం.

స్వరపేటిక తెగిన వ్యక్తి ఫ్యాన్ కు ఉరేసుకునే అవకాశం ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ విషయమై పోలీసులను అడగగా ఎలాంటి సమాధానము చెప్పడం లేదు. సంతోషి, రాములు హోటల్ గదిలోకి రావడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  కానీ వాళ్లు చనిపోయిన రోజు, సంఘటన జరిగినప్పుడు అక్కడ గది బయట రికార్డైన సీసీటీవీ కెమెరా దృశ్యాలను పోలీసులు బయటపెట్టడం లేదు.

ఈ కేసులో ఆ దృశ్యాలే కీలకంగా మారనున్నాయి.  మరోవైపు మాదాపూర్ పోలీసులు రాములు సంతోష్ కాల్ డేటా పై దృష్టి సారించారు. వారు మృతి చెందడానికి ముందు ఎవరెవరితో కాంటాక్టులో ఉన్నారు, అనే అంశాలను పరిశీలిస్తున్నారు.

‘చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం సాధించి, కుటుంబానికి అండగా ఉంటుందని భావిస్తే... అందనంత దూరం వెళ్ళిపోయింది.. అని మార్చురీ వద్ద సంతోషి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గతంలో స్వల్ప మార్కులతో కానిస్టేబుల్  ఉద్యోగం దూరం కావడంతో, ఈసారి సాధించేందుకు కుటుంబానికి దూరంగా ఉంటూ చదివేందుకు నగరానికి వచ్చిందని రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తండ్రి లేకపోవడంతో ఆమె తల్లి ప్రోత్సాహంతో.. ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరిలు చదువులను మధ్యలోనే వదిలేసి మరీ ఆమెను చదివించినట్లు పేర్కొన్నారు. ‘ఇద్దరిని ఎదుర్కొనే శక్తి ఉన్న నా చెల్లెలు చనిపోయేంత పిరికిది కాదు. ఎదుటి వ్యక్తి చంపేందుకు ప్రయత్నించినా అతన్ని తప్పించుకునే ధైర్యం ఆమెలో ఉంది.  నా సోదరి మృతిపై అనుమానాలు ఉన్నాయ’ని రాఘవేంద్ర తెలిపారు. రాములు, సంతోషిల మృతదేహాలకు శుక్రవారం ఉస్మానియా ఫోరెన్సిక్‌ విభాగం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. తర్వాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios