కాంగ్రెస్‌లో మండల కమిటీల చిచ్చు: గాంధీ భవన్ ముందు కామారెడ్డి నేతల ఆందోళన
ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మండల కమిటీల్లో సుభాష్ రెడ్డి వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని మదన్ మోహన్ రావు వర్గీయులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మండల కమిటీలు చిచ్చును రేపాయి. మండల కమిటీట్లో తమ వర్గానికి ప్రాధాన్యత దక్కలేదంటూ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు మూడు రోజుల క్రితం గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లాలో పీసీసీ ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ రావు వర్గానికి మండల కమిటీల్లో ప్రాధాన్యత దక్కలేదని మదన్ మోహన్ వర్గానికి చెందిన నేతలు సోమవారంనాడు గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగారు.
కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావును తప్పించాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సుభాష్ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారికే మండల కమిటీలో చోటు కల్పించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో మొదటి నుండి పార్టీలో ఉన్న వారికి కాకుండా సుభాష్ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారికే మండల కమిటీల్లో చోటు కల్పించారని మదన్ మోహన్ రావు వర్గానికి చెందిన నేతలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఇష్టారీతిలో కమిటీలను ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి పదవులు ఇవ్వకుండా ఇష్టారీతిలో పదవులను కేటాయించడాన్ని మదన్ మోహన్ రావు వర్గీయులు తప్పుబడుతున్నారు. పనిచేసే వారికి పదవులు కట్టబెట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మదన్ మోహన్ రావు వర్గీయులు చెబుతున్నారు. కానీ, దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. స్వంత పార్టీకి చెందిన నేతలే పార్టీని బలహీనపర్చే పద్దతులను వీడాలని వారు కోరుతున్నారు. గతంలో ఉన్న మండల కమిటీలను పునరుద్దరించాలని మదన్ మోహన్ రావు వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.
also read:మండల కమిటీల నియామకాల్లో అన్యాయం:గాంధీ భవన్ ముందు పాల్వాయి వర్గం ధర్నా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు మదన్ మోహన్ రావు ఆసక్తిని చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంపై మదన్ మోహన్ రావు ఫోకస్ పెట్టారు. ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ సమయంలో ఇరు వర్గాలు పోటీలు పడి పనిచేస్తున్నారు. అయితే క్రమంలోనే ఇరువర్గాలు పలుమార్లు గొడవకు దిగిన సందర్భాలు కూడ లేకపోలేదు. తాజాగా మండల కమిటీలు మరోసారి సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు కారణమైంది. మండల కమిటీల్లో మదన్ మోహన్ రావు వర్గానికి ప్రాధాన్యత దక్కలేదు. దీంతో మదన్ మోహన్ వర్గీయులు గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగారు. మండల కమిటీల నియామాకాల్లో పలు జిల్లాల్లో చోటు చేసుకున్న నిరసనలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో చూడాలి.