హైదరాబాద్:హైద్రాబాద్ సమీపంలోని శంషాబాద్‌ బూరుగుగడ్డ వద్ద సోమవారం నాడు ఉదయం ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో స్థానికులు  భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

చెన్నై నుండి హైద్రాబాద్‌కు ఎల్పీజీ గ్యాస్ లోడుతో వస్తున్న ట్యాంకర్ హైద్రాబాద్ వస్తోంది. అయితే ట్యాంకర్ బూరుగుగడ్డ వద్దకు వచ్చిన సమయంలో డివైడర్ ను ఢీకొని  రోడ్డుపైనే బోల్తా పడింది.

ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ కావడంతో ఈ ట్యాంకర్ వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ట్యాంకర్ ను రోడ్డుపై నుండి తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్యాంకర్ కు సమీపంలోకి సెల్‌ఫోన్లను, అగ్గిపెట్టెలు, లైటర్లను తీసుకు రాకుండా పోలీసులు నిరోధించారు.

ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. లారీ డ్రైవర్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో లారీ డ్రైవర్ చికిత్స పొందుతున్నాడు.