ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా బుధవారం ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది.

ఇది తీవ్ర అల్పపీడనంగా మారి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ , రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది.

తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల్లో రెండు చోట్ల ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసరాల్లో ఉన్న ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌లో ప్రాంతంలో అల్పపీడనం మంగళవారం ఉదయం బలహీనపడింది. అయినప్పటికీ దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది.