ప్రంపచంమంతా లవర్స్ డే జరుపుకుంటున్నది. శుభాకాంక్షలు చెప్పుకుంటూ యూత్ అంతా జోష్ లో ఉన్నది. కానీ హైదరాబాద్ లో మాత్రం పోలీసులు లవర్స్ కు భలే షాక్ ఇచ్చారు. లవర్స్ డే లేదు.. గివర్స్ డే లేదు పోండ్రి అన్నారు. ఇంతకూ హైదరాబాద్ లో లవర్స్ కు ఏం షాక్ తగిలిందబ్బా అనుకుంటున్నారా.? చదవండి వీడియో చూడండి.

హైదరాబాద్ దశాబ్దాల కాలంగా లవర్స్ కు అడ్డా ఏదంటే.. టక్కున చెప్పే పేరు ఇందిరాపార్కు. గతంలో అనేక సినిమాల షూటింగ్ లు కూడా ఇక్కడ జరిగాయి. సినిమాల్లో ప్రియుడు, ప్రియురాలు కలుసుకునే అతికొద్ది ప్రదేశాల్లో ఇందిరాపార్కు కూడా ఉండేది. అయితే మారుతున్న కాలంలో లవర్స్ కు ఇందిరాపార్కు మొఖం కొట్టింది. హైదరాబాద్ హైటెక్ సొగసులు సంతరించుకున్న తర్వాత ఇందిరాపార్కు కళ తప్పింది. ఏదో కొద్ది మోతాదులోనే లవర్స్ అక్కడ దర్శనమిస్తున్నారు. పబ్ లు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లకు ప్రేమ మారిపోవడంతో ఇందిరాపార్కు చిన్నబోయింది.

ఇది ఇలా ఉంచితే తాజాగా లవర్స్ డే నేపథ్యంలో ఇందిరాపార్కును పోలీసులు మూసివేశారు. జంటగా వచ్చే వాళ్లకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. దానికీ ఓ కారణం ఉంది. గత కొంతకాలంగా లవర్స్ ఎక్కడ కడబడ్డా తాళిబొట్లు పట్టుకెళ్లి వాళ్లకు పెళ్లి చేసుస్తున్నారు విహెచ్ పి, భజరంగ్ దళ్ సభ్యులు. దీంతో అనేకసార్లు గొడవులు కూడా జరిగాయి. లవర్స్ పై హిందూ సంస్థల ప్రతినిధులు దాడులు చేయడం.. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యుల మీద లవర్స్ దాడులు చేయడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్కులోనే అనేకసార్లు గొడవలు జరిగినందున ఈ ఒక్క రోజు ఇందిరాపార్కులోకి లవర్స్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తే చిక్కు లేకుండాపోతుందని పోలీసులు చెబుతున్నారు. అందుకే ఇందిరాపార్కు మూసేశారు. జంటగా వచ్చేవాళ్లను రానీయకపోవడంతో వచ్చిన జంటలన్నీ వెనుదిరిగిపోతున్నాయి. ఈ వీడియోలో ఇందిరాపార్కు పరిస్థితి మీరూ చూడండి.