తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని తీవ్ర మనస్తాపానికి గురైన బావామరదళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోమరంభీం జిల్లా వాంకిడి మండలం మహాగాంకు చెందిన భరత్, గౌరుబాయి బావామరదళ్లు.. వీరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో గౌరుబాయిని తల్లిదండ్రులు మందలించారు. దానితో పాటు భరత్‌ను కలవకుండా కట్టడి చేశారు. అప్పటి నుంచి మనస్తాపానికి గురైన గౌరుబాయి తన బావను మరచిపోలేక చనిపోవాలనుకుంది.

ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది.. దీనిని గమనించిన స్థానికులు వాంకిడి ప్రభుత్వాసుపత్రికి తరలించి.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే గౌరుబాయి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మరణించింది.

మరదలి మరణవార్తను తెలుసుకున్న భరత్ శనివారం ఉదయం బహిర్భూమికి అని చెప్పి ఇంటి పక్కనే ఉన్న పొలంలో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. అప్పటికే స్పృహ కోల్పోతున్న భరత్ జరిగిన విషయాన్ని అన్నయ్యకి చెప్పాడు. దీంతో అతను తమ్ముణ్ణి వాంకిడి ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి ఆసిఫాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో భరత్ కూడా మరణించాడు. ఇద్దరి మరణంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది.